
రంపచోడవరం: జనసేన పార్టీ వి.ఆర్.పురం మండల నాయకుల ఆధ్వర్యంలో మండలంలోని ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రాంతాలను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా రాజుపేటకాలనీ గ్రామ శివారులోని చెరువులో పనిచేస్తున్న ఉపాధి హామీ కార్మికులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు.
కార్మికులు పాటించవలసిన నియమ నిబంధనలు, ఎండలను దృష్టిలో ఉంచుకుని పని వేళలు, అలాగే ప్రభుత్వం కల్పిస్తున్న వెసులుబాటులపై అవగాహన కల్పించారు. కూటమి ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు.
ప్రతి ఉపాధి హామీ కార్మికుడు, మేట్, ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ మరియు పై స్థాయి అధికారులు బాధ్యతగా పనిచేస్తే కార్మికులతో పాటు రైతులకు కూడా న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ముందుగా ఫీల్డ్‌లో ఉన్న జూనియర్ ఇంజనీర్ వెంకటేశ్వరరావుతో పలు అంశాలపై చర్చించారు.
మండలంలోని కొన్ని ప్రాంతాల్లో పనులు బాధ్యతారాహిత్యంగా జరుగుతున్నాయని, కొంతమంది అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వారిపై పూర్తిస్థాయి నిఘా ఉంచాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ములకాల సాయికృష్ణ, మహిళా అధ్యక్షురాలు బాగుల ప్రమీళా రాణి, కార్యదర్శి బాగుల అంజన రావు, మండల యూత్ ప్రెసిడెంట్ పెడపెట్ల పవన్ కళ్యాణ్, ఉపాధి హామీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.