
హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రత్యేక గుర్తింపు పొందిన సీనియర్ నటి పావలా శ్యామల అంత్యక్రియలు నేడు ఫిలింనగర్ మహాప్రస్థానంలో నిర్వహించనున్నారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఇటీవల కన్నుమూశారు.
వనస్థలిపురంలోని ‘రెడీ టూ సర్వ్’ ఆశ్రమం నుంచి ఆమె పార్థివ దేహాన్ని ఫిలింనగర్ మహాప్రస్థానానికి తరలించనున్నారు. సినీ ప్రముఖులు, తోటి నటీనటులు, అభిమానులు చివరి నివాళులు అర్పించేందుకు గంటపాటు అక్కడ ఉంచి, అనంతరం ఉదయం 11 గంటలకు అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ప్రతినిధులు, పలువురు సినీ ప్రముఖులు హాజరై ఆమెకు శ్రద్ధాంజలి ఘటించనున్నారు. అంత్యక్రియల ఏర్పాట్లను నటి కరాటే కళ్యాణి పర్యవేక్షిస్తున్నారు.
1984లో విడుదలైన ‘ఛాలెంజ్’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన పావలా శ్యామల, వందకు పైగా చిత్రాల్లో తనదైన హాస్య నటనతో ప్రేక్షకులను అలరించారు. చివరిసారిగా 2019లో వచ్చిన ‘మత్తు వదలరా’ చిత్రంలో నటించారు. గత కొన్నేళ్లుగా ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో కుమార్తెతో కలిసి జీవనం సాగించిన ఆమె మరణం సినీ పరిశ్రమను విషాదంలో ముంచెత్తింది. ఆమెకు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు.