
గుంటూరు: సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందించడంలో చిత్రకళలు కీలక పాత్ర పోషిస్తున్నాయని విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ డా. లావు రత్తయ్య పేర్కొన్నారు.
వెల్లటూరి ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో వికాస్ ఇన్ ఫంక్షన్ హాల్లో ఆదివారం ఆర్ట్ ఎగ్జిబిషన్‌ను ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా సమాజంలో వస్తున్న మార్పులను చిత్రాల రూపంలో ప్రతిబింబించడం ప్రజల్లో చైతన్యం పెంచుతుందని తెలిపారు. విజ్ఞాన్ యూనివర్సిటీలో త్వరలో వెల్లటూరి చిత్ర ప్రదర్శనను నిర్వహించనున్నట్లు కూడా ఆయన వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ చిత్రలేఖనం భావవ్యక్తీకరణకు గొప్ప వేదికగా నిలుస్తూ సమాజ మార్పులకు దోహదపడుతుందని తెలిపారు. ప్రభుత్వం కూడా చిత్రకళలను ప్రోత్సహిస్తోందని చెప్పారు. వికాస్ సంస్థల చైర్మన్ శంకర్రావు మాట్లాడుతూ చిత్రకళలు విద్యార్థుల ఆలోచనా శక్తిని పెంచుతాయని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఆర్‌టీఐ చీఫ్ కమిషన్ చైర్మన్ వజ్జా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటే చిత్రకళలు వాస్తవాలను ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు. చిత్రకళను మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జనసేన అధికార ప్రతినిధి ఆళ్ల హరి, రాజమండ్రి చిత్రకలానికేతన్ వ్యవస్థాపకుడు మృత్యుంజయరావు, ప్రముఖ చిత్రకళాకారుడు విజయ్ కుమార్, వెల్లటూరి ఆర్ట్ అకాడమీ ప్రిన్సిపాల్ హేమలత, వంకాయలపాటి సురేష్ బాబు, డైరెక్టర్ వెల్లటూరి కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
27వ తేదీన జరిగే ముగింపు కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై చిత్రకళను వీక్షించి ప్రోత్సాహం అందించాలని డైరెక్టర్ ప్రసాద్ కోరారు.