
మంగళగిరి: జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యల పరిష్కార వేదికగా నిర్వహిస్తున్న “జనవాణి” కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా వినేందుకు ఏర్పాటు చేసిన ఈ వేదికపై రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవుతున్నారు.
బుధవారం మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన జనవాణి కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి, ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పత్తి చంద్రశేఖర్ ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఆయనతో పాటు కృష్ణాజిల్లా డీసీఎంఎస్ అధ్యక్షుడు రామకృష్ణ, కృష్ణ పెన్నా మహిళ రీజినల్ కోఆర్డినేటర్ రావి సౌజన్య, లీగల్ సెల్ రాజశేఖర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పత్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చూపుతున్న చొరవకు ప్రజల నుండి మంచి స్పందన వస్తోందని తెలిపారు. వచ్చిన ప్రతి ఫిర్యాదును పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.