






అభివృద్ధి, ఆధ్యాత్మికతతో అంతర్వేది వర్థిల్లాలి
* పవిత్ర క్షేత్రంలో తాగునీటి సమస్య ఉండకూడదు
* రాజోలు నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
* రూ.17.33 కోట్లతో అంతర్వేదిలో నిర్మించిన మంచినీటి పథకం ప్రారంభం
* తీరనున్న 30 వేల మంది తీర ప్రాంత ప్రజల తాగునీటి కష్టాలు
* రూ. 5 కోట్లతో ర్యాపిడ్ సాండ్ ఫిల్టర్ 6 ఎంఎల్ టీ నిర్మాణానికి శంకుస్థాపన
‘ఏదైనా ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అక్కడ చేపట్టాల్సింది కేవలం నిర్మాణాలు మాత్రమే కాదు, అక్కడ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలి. మౌలిక వసతులు మెరుగుపరచి వారి జీవితాలకు భరోసా ఇవ్వాలి. భవిష్యత్తుపై నమ్మకం కలిగించాల’ని ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. అంతర్వేదిలాంటి పవిత్ర ప్రాంతంలో అభివృద్ధి, ఆధ్యాత్మికతతో కలిసి నడవాలని ఆకాంక్షించారు. ఈ పుణ్యభూమి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం బలమైన సంకల్పంతో పని చేస్తుందని హామీ ఇచ్చారు. గురువారం రాజోలు నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ముందుగా రూ.17.33 కోట్లతో అంతర్వేదిలో నిర్మించిన మంచినీటి పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ఒ.ఎన్.జి.సి. నిధులు రూ. 5 కోట్లతో 6 మిలియన్ లీటర్ల సామర్ధ్యం కలిగిన ర్యాపిడ్ సాండ్ ఫిల్టర్ల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు , స్థానిక శాసనసభ్యులు శ్రీ దేవ వరప్రసాద్ గారు, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జల్లా కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్ రావిరాల గారు, గ్రామీణ నీటిసరఫరా విభాగం ఈఎన్సీ శ్రీమతి గాయత్రి గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులతో ఈ రోజున మీ అందరి కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం ఆనందంగా ఉంది. జల్ జీవన్ మిషన్ నిధులతో అంతర్వేది దేవస్థానం, అంతర్వేదికర, పల్లెపాలెం, గొంది గ్రామ పంచాయతీల పరిధిలో 13 గ్రామాలకు చెందిన 30 వేల మంది ప్రజల దాహార్తి తీర్చే లక్ష్యంతో రూ.17.33 కోట్లతో నిర్మించిన సమగ్ర రక్షిత తాగునీటి సరఫరా పథకాన్ని మీ అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చాం. ఈ ప్రాజెక్టు 30 వేల మంది తీర ప్రాంత ప్రజల దాహార్తిని తీరుస్తుంది. దీని కోసం 10 ఎకరాల విస్తీర్ణంలో చెరువును అభివృద్ధి చేసి, దానికి అనుబంధంగా 3 మిలియన్ లీటర్ల నీటి శుద్ధి సామర్ధ్యం కలిగిన రాపిడ్ సాండ్ ఫిల్టర్ ప్లాంటు, వాటర్ ట్యాంక్ నిర్మించాం. ఈ ప్రాజెక్టుని అత్యంత ప్రాధాన్యతాంశంగా తీసుకుని ఈ వేసవిలోపు అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో గ్రామీణ నీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేశాం. ఈ పథకం కోసం గన్నవరం కాలువ నుంచి పంపింగ్ ద్వారా నీటిని తీసుకువచ్చి చెరువులో స్టోరేజీ చేయనున్నాం.
30 ఏళ్ల తాగునీటి కష్టాలకు చెక్
గతంలో 12 కిలోమీటర్ల దూరంలో అంతర్వేదిపాలెం రక్షిత తాగునీటి పథకం నుంచి ఈ ప్రాంతానికి తాగునీరు సరఫరా చేసేందుకు ఇబ్బందులు తలెత్తేవి. సుమారు 50 గ్రామాలు దాటి నీరు రావాల్సి ఉండడంతో ప్రజల అవసరాలకు సరిపడ తాగు నీరు అందేది కాదు. 30 ఏళ్లుగా తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనానికి వచ్చిన సందర్భంలో ప్రజలు తమ తాగునీటి వెతలు చెప్పుకొంటూ వినతిపత్రం ఇచ్చారు. ఈ రోజు ప్రారంభించిన అంతర్వేది సీపీడబ్ల్యూఎస్ పథకం ద్వారా సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. వేసవి నీటి కష్టాలు పూర్తిగా తొలగిపోతాయి. తీర ప్రాంతం కావడం వల్ల ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు గృహ అవసరాలకు వినియోగించుకునేందుకు కూడా పనికి వచ్చే పరిస్థితి లేదు. అంతర్వేది సమగ్ర రక్షిత తాగునీటి పథకం ద్వారా పూర్తి స్థాయిలో మీ అవసరాలకు తగిన విధంగా స్వచ్ఛ జలాలు సరఫరా చేసే ఏర్పాటు చేస్తాం.
ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందిస్తాం
రూ.5 కోట్ల ఓఎన్జీసీ సీఎస్ఆర్ నిధులతో గుడిమెల్లంక వద్ద ఏర్పాటు చేయనున్న 6 మిలియన్ లీటర్ల సామర్ధ్యం కలిగిన ర్యాపిడ్ సాండ్ ఫిల్టర్ల ఏర్పాటు పనులు ప్రారంభించాం. ఈ పనులు పూర్తయితే గుడిమెల్లంక రక్షిత తాగునీటి పథకం సామర్ధ్యం మెరుగుపడుతుంది. 29 గ్రామాల పరిధిలో సుమారు లక్షా 20 వేల మందికి పూర్తి స్థాయిలో తాగునీరు అందుతుంది. అలాగే పల్లెపండగ 2.0 కూడా ఇదే రాజోలు నియోజకవర్గం నుంచి ప్రారంభించాం. అదే రోజు శంకరగుప్తం డ్రెయిన్ సమస్యపై అధ్యయనం చేసి 35 రోజుల్లో రూ. 20.77 కోట్లతో డ్రెయిన్ ఆధునీకరణ పనులకు ముక్కోటి ఏకాదశి రోజున శ్రీకారం చుట్టాం. గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జల్ జీవన్ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ 55 లీటర్ల సురక్షిత తాగునీరు అందించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేస్తోంది. ప్రతి గ్రామానికీ, ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరు అందించే లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్తాం” అని చెప్పారు.