











యువతా… ఏ భావజాలాన్ని గుడ్డిగా నమ్మవద్దు
• మీ ఆలోచనలు భావోద్వేగాలతో కాకుండా వాస్తవికంగా ఉండాలి
• దేశ భవిష్యత్తుకి విద్యార్ధులే నావికులు
• మీ ప్రతిభ, జ్ఞానం… సమాజానికి, దేశానికి ఉపయోగపడాలి
• ఆంధ్ర విశ్వవిద్యాలయం భారతీయ వారసత్వ సంపద చిహ్నం
• ఆంధ్ర రాష్ట్రంలో అన్ని కళల అభివృద్ధికి ఏర్పాటైన సంస్థ
• మేధస్సు, సంస్కృతి, దేశ నిర్మాణం అనే మూడు స్థంభాలపై నిర్మితమైంది
• శతాబ్ద కాలంగా వేలాది మంది మేధావులను సమాజానికి అందించింది
• వారి స్ఫూర్తితో మీరంతా సమాజాన్ని మార్చే బలమైన శక్తులుగా ఎదగాలి
• నా ఆఖరిశ్వాస వరకు భవిష్యత్ తరాల కోసమే పని చేస్తా
• ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల మెగా కల్చరల్ ఫెస్ట్ ముగింపు వేడుకల్లో రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
‘యువత ఏ ఒక్క భావజాలాన్ని గుడ్డిగా నమ్మవద్దు. ఎవరి ఐడియాలజీని గుడ్డిగా నమ్మి ప్రభావితం కావద్దు. మీరు ప్రభావితం అయిన భావజాలం ఈ కాలానికి సరిపోతుందా? లేదా అనేది ఒకటికి పదిసార్లు ఆలోచించి ముందుకు వెళ్లండి. భావోద్వేగాలతో కాకుండా వాస్తవికత ఆధారంగా ఆలోచనలు చేయాల’ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. ప్రపంచాన్ని మార్చగల శక్తివంతమైన ఆయుధం విద్య అని, సమాజ సేవే యువత ధ్యేయం కావాలని కోరారు. గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశం ప్రపంచ శక్తిగా నిలిస్తే, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. తన ఆఖరిశ్వాస వరకు భవిష్యత్ తరాల కోసమే పని చేస్తానని తెలిపారు. బుధవారం సాయంత్ర ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన మెగా కల్చరల్ ఫెస్ట్ ముగింపు వేడుకలకు ముఖ్యఅతిథిగా హజరయ్యారు.
ఈ సందర్భంగా విద్యార్ధులను ఉద్దేశించి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తూ “ఆంధ్ర విశ్వకళాపరిషత్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం రావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. యూనివర్శిటీ గురించి మాట్లాడుకోవాలంటే మొదట చిహ్నం గురించి మాట్లాడుకోవాలి. ఆంధ్ర యూనివర్సిటీ లోగోను ప్రత్యేక శ్రద్ధతో తయారుచేశారు. లోగోలోని ప్రతి అంశానికి అర్థం స్ఫూరించేలా తయారు చేశారు. కాంతి కిరణాలతో ఉదయించే సూర్యుడు విశ్వవిద్యాలయాన్ని, దాని అనేక అధ్యయన విభాగాలను సూచిస్తుంది. ఇక కమలం శ్రేయో దేవత లక్ష్మీ, జ్ఞాన దేవత సరస్వతి ఇద్దరినీ ప్రతిబింబిస్తుంది. సూర్యకిరణాలపై ఆర్యులలో దీవెన చిహ్నమైన స్వస్తిక్ ఉంటుంది. అరవై నాలుగు తామర రేకులతో కూడిన శిఖరం బయటి వృత్తం, భారతదేశ శాస్త్రీయ సంప్రదాయంలోని అరవై నాలుగు కళలను, శాస్త్రాలను సూచిస్తుంది. ఇక సముద్రాన్ని– విద్యార్థులు ప్రావీణ్యం పొందడానికి దోహదపడే విస్తారమైన జ్ఞానకేంద్రం అనే అర్థంలో తయారు చేశారు. ఉపనిషత్తులలోని ‘తేజస్వినావధితమస్తు’ అనే నినాదాన్ని కూడా లోగోలో భాగం చేశారు. దీని అర్థం ఏమిటంటే ‘దైవిక కాంతి మన అధ్యయనాలను ప్రకాశింపజేయుగాక‘ అని. ఈ జ్ఞాన చిహ్నం కింద అన్ని మతాలలోనూ ప్రాశస్త్యం కలిగిన నెలవంక ఉంది. ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని కళల అభివృద్ధికి నెలకొల్పిన సంస్థ అనే అర్థంతో ‘ఆంధ్ర విశ్వకళాపరిషత్’ అని దీనికి నామకరణం చేశారు. లోగోలోని దిగువభాగంలో ఉన్న రెండు సర్పాలు జ్ఞానాన్ని కోరుకునేవారిని, జ్ఞాన సంరక్షకులను సూచిస్తాయి.
*వేలాది మంది మేధావులను సమాజానికి అందించిన సంస్థ*
ఆంధ్ర విశ్వవిద్యాలయం గురించి పూర్వ విద్యార్ధి, నా ఆత్మీయులు శ్రీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి ద్వారా తెలుసుకున్నాను. ఆయన ఇదే యూనివర్శిటీలో న్యూక్లియర్ ఫిజిక్స్ లో మాస్టర్స్ చేశారు. ఆయన అన్ని విభాగాల గొప్పదనం గురించి వివరించే వారు. అలాంటి ఆంధ్ర యూనివర్శిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా విద్యనందించే ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు చాలా ఉన్నప్పటికీ, కొన్ని తరాలను తీర్చిదిద్దుతూ అద్వితీయమైన జ్ఞానాన్ని అందించే విద్యా సంస్ధలు కొన్నే ఉన్నాయి. ఈ కొద్ది సంస్థల్లో శతాబ్ద కాలంపాటు ఎన్నో వేల మంది మేధావులను సమాజానికి అందించిన చరిత్ర ఆంధ్ర విశ్వకళా పరిషత్, ఆంధ్ర యూనివర్శిటీకే దక్కుతుంది. ఈ ఆంధ్ర విశ్వవిద్యాలయం కేవలం ఒక ప్రాంగణం మాత్రమే కాదు. విలువలతో వ్యక్తిత్వంతో దేశ నిర్మాణంలో భాగస్వామ్యంగా నిలిచి, శతాబ్దకాలాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న భారతీయ వారసత్వ సంపదకు చిహ్నం. 1926లో ఉన్నత విద్యను అందించాలన్న గొప్ప సంకల్పంతో మేధస్సు, సంస్కృతి, దేశ నిర్మాణం అనే మూడు స్థంభాలపై ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పాటైంది. ఇక్కడ విద్యను పూర్తి చేసుకుని బయటకు వెళ్లిన వారు కేవలం ఉద్యోగాలుగా కాదు.. వివిధ రంగాల్లో సమాజాన్ని ముందుకు నడిపే నాయకులుగా, మేధావులుగా, వ్యవస్థలో మార్పు తీసుకువచ్చే బలమైన శక్తిగా నిలిచారు. శతాబ్ది చరిత్ర కలిగిన ఈ స్థాయిలో ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని నేడు మనమంతా చూడగలుగుతున్నామంటే అందుకు పునాదులు వేసిన మహనీయులు డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి గారికి, అందుకు విలువైన సహకారం అందించిన మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి, నోబెల్ అవార్డు గ్రహీత సర్ సి.వి. రామన్ గారికి మనస్ఫూర్తిగా నమస్సుమాంజలులు తెలుపుతున్నాను.
*జీవితంలో ఎటు వెళ్లాలన్న ఆలోచనలు ఇక్కడే మొదలవుతాయి*
ఆంధ్ర విశ్వ విద్యాలయం శతాబ్దకాలం ఎంతో మంది చరిత్రలో నిలిచారు. ఇదే విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేసిన మాజీ ఉపరాష్ట్రపతి గారు ఉన్నారు. మనం జీవితంలో ఎటువైపు వెళ్లాలి అనే మార్గాన్ని ఎంచుకునే ఆలోచన మనకి యూనివర్శిటీతో మొదలవుతుంది. ఆ గమ్యాన్ని ఎలా చేరుకోవాలనేది మాత్రం స్వశక్తితోనే నిర్ణయించుకోవాలి. మీరు కేవలం విశ్వ విద్యాలయం విద్యార్ధులు మాత్రమే కాదు.. ఈ విశ్వ విద్యాలయం భవిష్యత్తు మీరు. ఇక్కడ గడిపే రోజులు మీ జీవితంలో ముఖ్యమైన క్షణాలు. మీ ఆలోచనలు తీర్చిదిద్దే అద్భుత క్షణాలు. దేశ భవిష్యత్తుకు మీరే నావికులు. విద్య అంటే పుస్తకాల్లో ఉన్న జ్ఞానం మాత్రమే కాదు. సమస్యల్ని ఎదుర్కోగలిగే ధైర్యం. సరైన నిర్ణయాలు తీసుకునే వివేకం. సమాజానికి ఉపయోగపడే బాధ్యత. సౌతాఫ్రికా అధ్యక్షునిగా చేసిన శ్రీ నెల్సన్ మండేలా గారి మాటల్లో చెప్పాలంటే ప్రపంచాన్ని మార్చగలిగే అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య. మీ లక్ష్యం కేవలం ప్రతిభ కాదు. మీ ధ్యేయం సమాజ సేవ కూడా కావాలి. మీ జ్ఞానం మీ కోసమే కాకుండా, సమాజానికి, దేశానికి ఉపయోగపడాలి.
ఈ రోజు ప్రపంచ స్థాయిలో భారత దేశం ఒక బలమైన దేశంగా నిలిచింది. గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఆత్మనిర్భర్ భారత్, మేకిన్ ఇండియా, వికసిత్ భారత్ 2047 వంటి కార్యక్రమాలు భారత దేశాన్ని స్వయం సమృద్ధి వైపు తీసుకువెళ్తున్నాయి. రాష్ట్రంలోనూ విద్యా, సాధికారత, యువత, అవకాశాలను అందిపుచ్చుకునే ఆలోచనలతో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తోంది. రాష్ట్రం పునర్నిర్మాణంలో యువతని భాగస్వామ్యం చేసే దశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మార్పుని సాధించగలిగేది యువత మాత్రమే. మన భవిష్యత్తుని మన ఆలోచనలే నిర్ణయిస్తాయి. మీ విలువలు, చర్యలే నిర్ణయిస్తాయి. మీ విజ్ఞానం మీ ఆలోచనలు ఒక పరిష్కార మార్గాలుగా రూపాంతరం చెందాలి. “మీ జ్ఞానం ఆవిష్కరణగా మారాలి. మీ ఆలోచనలు పరిష్కారాలుగా మారాలి. మీ కృషి సమాజానికి మరియు దేశానికి మేలు చేసే అర్థవంతమైన మార్పుగా మారాలి. బలమైన నమ్మకంతో కలలు కనండి. మీ కలల్ని తొక్కుతూ నడుస్తున్న కాళ్లని ఖండించే వరకు కలలు కనండి. నిరంతర కృషి, నిబద్దతతో ముందు సాగండి.
• ఏ భావజాలాన్ని గుడ్డిగా నమ్మొద్దు
కారల్ మార్క్స్ లాంటి వ్యక్తులు, నాలాంటి వ్యక్తులు ఎవరు ఏ ఐడియాలజీ చెప్పినా గుడ్డిగా నమ్మి ప్రభావితం కావొద్దు. ఆ సిద్ధాంతం ఈ కాలానికి సరైనదా? కాదా? భవిష్యత్తుల్లో నిలబడుతుందా? లేదా? అని ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. కేవలం భావోద్వేగాలతో కాకుండా వాస్తవాలు, తర్కం ఆధారంగా ఆలోచించాలి. 80, 90ల్లో బ్యాలెన్డ్స్ లేని ఐడియాలజీ నమ్మి ఎంతో మంది అడవులకు వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. ఏదైనా ఒక ఐడియాలజీ నమ్మే ముందు ధర్మబద్ధంగా ఉందా? రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉందా? దేశ సమగ్రతను కాపాడుతుందా? అని ఆలోచన చేయాలి. మనం ప్రభావితమయ్యే ఐడియాలజీ ఒక వర్గానికి, ఒక కులానికి లేదా ఒక మతానికి మాత్రమే లాభం చేకూరుస్తూ, మిగిలిన వారిని తక్కువ చేసి చూస్తుంటే అది నైతికంగా సరైనది కాదు అని అర్థం. విశ్వ విద్యాలయాల్లో ఎంతో మంది విద్యార్ధి నాయకులు, రాజకీయ పార్టీలకు సంబంధించిన విద్యార్థి సంఘాలు ఉండొచ్చు. వాళ్లు ఏ ఐడియాలజీ చెప్పినా ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఈ మాటలు పార్టీ పెట్టిన కొత్తలో చెప్పటం లేదు. పార్టీ పెట్టి దశాబ్ధ కాలం తరువాత చెబుతున్నాను. ఎన్నో ఎదురు దెబ్బలు తిని, నలిగిన తరువాత చెబుతున్నాను. ఏదైనా ఒక ఐడియాలజీని నమ్మే ముందు భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని ఒక సమగ్రమైన నిర్ణయానికి రండి.
*మీరో విస్పోటనం… ఏదీ అనుకుంటే అది జరుగుతుంది*
దేశం యొక్క అభివృద్ధి యువత మీద ఆధారపడి ఉంటుంది. వారి శక్తి, ఉత్సాహం, సృజనాత్మకత దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయి. వారిలో న్యూక్లియర్ ఎనర్జీ దాగి ఉంటుంది. తలుచుకుంటే ఒక పెద్ద విస్పోటనం సృష్టించగలరు. నాలాంటి వాడే సమాజానికి ఇంత చేయగలిగితే… మీరికెంత చేయగలరో ఆలోచించాలి. యద్భావం తద్భవతి… మీరు ఒక భావాన్ని ఎంత బలంగా నమ్ముతారో ఆ భావం మంత్రంగా మారి… ఆ మంత్రం సాధనగా మారుతుంది. ఆ సాధన ఫలితాలు ఇస్తుంది. మంచి, చెడు మీరేది బలంగా నమ్మితే అది జరుగుతుంది. యువత దేశ నిర్మాణంలో భాగస్వాములు అవ్వాలని, మీలో ప్రతి ఒక్కరు బాధ్యతగల పౌరులుగా ఎదగాలని ఆశిస్తున్నాను” అన్నారు.