
ఏలూరు జిల్లాలో పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కీలక చర్యలు చేపట్టారు. దాతల సహకారంతో రూ.70 లక్షల వ్యయంతో 7 పోలీస్ వాహనాలను ఒకేరోజు అందజేయడం విశేషంగా నిలిచింది. ఈ వాహనాలను జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్, రాష్ట్ర గృహనిర్మాణ మరియు సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యేలు పత్సమట్ల ధర్మరాజు, సొంగా రోషన్ కుమార్ తదితరులు సంయుక్తంగా ప్రారంభించి సంబంధిత పోలీస్ స్టేషన్లకు అందజేశారు.
ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో నేరాలను అంతర్జాతీయ ప్రమాణాలతో నియంత్రించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏటా రూ.100 కోట్లు కేటాయించడం శుభపరిణామమన్నారు. దాతల సహకారంతో 7 వాహనాలను ఒకేరోజు అందించడం మంచి రికార్డు అని పేర్కొన్నారు. అందులో 6 వాహనాలు పత్సమట్ల ధర్మరాజు సారథ్యంలో, ఒక వాహనం సొంగా రోషన్ కుమార్ ఆధ్వర్యంలో సమకూర్చడం స్ఫూర్తిదాయకమన్నారు. నేరాల నివారణలో ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇప్పటివరకు ఏలూరు జిల్లాకు దాతలు 19 వాహనాలు అందించడం విశేషమని తెలిపారు.
కొలుసు పార్థసారథి మాట్లాడుతూ, ఎమ్మెల్యేల సారథ్యంలో దాతలు ముందుకు వచ్చి వాహనాలు సమకూర్చడం అభినందనీయం అన్నారు. జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి, ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్ నేతృత్వంలో జిల్లా అభివృద్ధి సాధిస్తున్నదని ప్రశంసించారు. పోలీసుల వేగవంతమైన చర్యల వల్ల నేరాలు త్వరగా ఛేదించబడుతున్నాయని తెలిపారు. సిఎస్ఆర్ నిధులను అన్ని ప్రాంతాలకు సమానంగా వినియోగించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసు సిబ్బంది, దాతలు తదితరులు పాల్గొన్నారు.