
- ప్రభుత్వ సేవలపట్ల ప్రజల సంతృప్తిస్థాయి ప్రతీ 15 రోజులకు వృద్ధి కనపడేలా అధికారులు తమ పనితీరును మెరుగుపరచుకోవాలి..
- జిల్లాలోని అన్ని సంక్షేమ వసతి గృహాలలో విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలి..
- డివిజినల్ స్థాయి అధికారులు ప్రతీ నెల సంక్షేమ వసతి గృహాలను సందర్శించి సౌకర్యాలు పరిశీలించాలి..
- రబీలో 3. 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలి..
- నియోజకవర్గంలో చేపట్టే అభివృద్ధి పనులపై స్థానిక ప్రజాప్రతినిధుల సూచనలు తప్పనిసరిగా పరిగణనలోనికి తీసుకోవాలి..
- రానున్న వేసవిలో జిల్లాలో ఎటువంటి త్రాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలి..
- డబ్బులు తీసుకుని పేదల గృహాలు నిర్మాణం పూర్తిచేయని కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి..
- ఈనెల 20వ తేదీ వరకు కాలువలకు నీటి విడుదల పొడిగింపునకు సమావేశం తీర్మానం..
- రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి తో కలిసి జిల్లా సమీక్షా సమావేశంలో జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష..
ఏలూరు: రాష్ట్ర ప్రభుత్వం అందించే సేవలపై ప్రజల సంతృప్తి ప్రతి 15 రోజులకు పెరుగేలా అధికారులు తమ పనితీరును మెరుగుపరచాలని పౌర సరఫరాల శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ హాలులో ఆయన అధ్యక్షతన జిల్లా సమీక్షా సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, సొంగా రోషన్ కుమార్, పత్సమట్ల ధర్మరాజు, మద్దిపాటి వెంకటరాజు, చిర్రి బాలరాజు, జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ, డీఎఫ్‌ఓ సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరి, వారు సంతృప్తిగా వినియోగించుకున్నప్పుడే లక్ష్యం నెరవేరుతుందని అన్నారు. ప్రజల అభిప్రాయాలను ఐవీఆర్‌ఎస్ ద్వారా సేకరిస్తున్నట్లు తెలిపారు. వచ్చే సమీక్ష నాటికి కనీసం 10% సంతృప్తి పెరగాలని, వెనుకబడిన అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జిల్లాలో దెబ్బతిన్న రహదారుల మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణం త్వరితగతిన చేపట్టాలని ఆదేశించారు. వసతి గృహాల్లో డైనింగ్ హాల్స్, ఆర్.ఓ నీరు, సీసీ కెమెరాలు, టాయిలెట్లు వంటి సదుపాయాలు విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పూర్తి చేయాలని సూచించారు. దీర్ఘకాలంగా ఒకేచోట పనిచేస్తున్న వార్డెన్ల బదిలీకి 48 గంటల్లో చర్యలు తీసుకోవాలని చెప్పారు.
బస్టాండ్లు, బస్టాప్‌లలో తాగునీరు, వేసవిలో కాలువల పూడికతీత, సాగు-త్రాగునీటి సరఫరా, ఎల్‌ఎల్‌ఆర్ డ్రైవింగ్ లైసెన్స్ క్యాంపులు నిర్వహణ, రబీ ధాన్యం సేకరణ, రేషన్ దుకాణాల పనితీరు మెరుగుదలపై కూడా సూచనలు ఇచ్చారు. గృహ నిర్మాణంలో నిర్లక్ష్యం చేసిన కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.
పర్యాటకాభివృద్ధి కోసం టెంపుల్ టూరిజం, పోలవరం ప్రాంత అభివృద్ధిపై ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ద్వారకా తిరుమలలో రద్దీ రోజుల్లో అదనపు బస్సులు నడపాలని తెలిపారు.
మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ వసతి గృహాల్లో పేరెంట్స్ సమావేశాలు నిర్వహించి 15 రోజుల్లో సదుపాయాలు మెరుగుపరచాలని సూచించారు. రైతులకు అవసరమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలని, విద్యార్థులు, ఉద్యోగుల అవసరాలకు అనుగుణంగా ఆర్టీసీ సర్వీసులు పెంచాలని చెప్పారు.
జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి వసతి గృహాల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు తమ ప్రాంత సమస్యలను సమావేశంలో ప్రస్తావించారు.
సమావేశంలో సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, ఐటిడిఏ పిఓ రాములు నాయక్, ఆర్డీఓలు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.