అమరావతి రాజధాని బిల్లు ఆమోదం – పోలవరంలో ఘనంగా సంబరాలు

అమరావతి రాజధాని బిల్లు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందిన చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు క్యాంపు కార్యాలయంలో ఆనందోత్సాహాల మధ్య సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజుతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు దీపాలు వెలిగించి హర్షం వ్యక్తం చేస్తూ ఈ విజయాన్ని స్వాగతించారు.

ఈ బిల్లుకు పూర్తి మద్దతు ఇచ్చి ఆమోదానికి కీలక పాత్ర పోషించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లకు ఎమ్మెల్యే హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అమరావతి రాజధాని బిల్లు ఆమోదం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందని అన్నారు. ఈ నిర్ణయం రాష్ట్రానికి స్థిరమైన పరిపాలనకు పునాది వేస్తుందని, పెట్టుబడులు మరియు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు.

ప్రజల దీర్ఘకాల ఆశలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్ తరాలకు ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షుడు పసుపులేటి రాము, ఉపాధ్యక్షుడు కొప్పుల శ్రీకాంత్, కూటమి నాయకులు తమ్మన సాంబశివరావు, సరియం రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.