కేరళలో హోరాహోరీ!

*తాజా సర్వేలో యూడీఎఫ్‌కు స్వల్ప ఆధిక్యం
* ఫిబ్రవరి, మార్చి సర్వేల్లో ఎల్డీఎఫ్‌ ముందంజ

గత పదేళ్లుగా అధికారంలో ఉన్న వామపక్ష ప్రజాతంత్ర కూటమి (ఎల్డీఎఫ్‌) వరుసగా మూడో విజయం సాధించేదీ, లేనిదీ కేరళ అసెంబ్లీ 16వ ఎన్నికలు తేల్చివేయబోతున్నాయి. ఈ నెల 9న కేరళ శాసనసభ (మలయాళంలో నియమసభ)లోని మొత్తం 140 స్థానాలకు జరిగే పోలింగ్‌లో సీపీఎం ముఖ్యమంత్రి శ్రీ పినరయి విజయన్‌ పాలనపై, రాజకీయ సామర్ధ్యంపై రెండు కోట్ల డెబ్బయి వేలకు పైగా ఉన్న ఓటర్లు తీర్పు ఇవ్వబోతున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా (1980 నుంచి) కేరళలో ఒక పక్క కాంగ్రెస్, మరోపక్క కమ్యూనిస్టుల నాయకత్వంలోని రెండు కూటములు యూడీఎఫ్, ఎల్డీఎఫ్‌ల మధ్య అధికారం బదిలీ అవుతూ వస్తోంది. అప్పటి నుంచీ ఏ ఒక్క కూటమి వరుసగా రెండు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రాలేదు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి బలపడినప్పటి నుంచి కేరళలో ఈ పార్టీ కూటమి కూడా పోటీ చేస్తున్నాగాని అది మూడో స్థానానికి పరిమితమౌతోంది. అయితే, ప్రతి ఐదేళ్లకూ పాలక కూటమిని మార్చే ఆనవాయితీకి కేరళ ప్రజలు 2021 అసెంబ్లీ ఎన్నికల్లో స్వస్తి చెప్పారు. ఎల్డీఎఫ్‌కు వరుసగా రెండోసారి మెజారిటీ సీట్లు కట్టబెట్టారు. 2026 శాసనసభ ఎన్నికల్లో సీపీఎం నాయకత్వంలోని ఎల్డీఎఫ్‌ మరోసారి గెలిస్తే కేరళ రాజకీయాల్లో కొత్త చరిత్రకు తెర తీసినట్టవుతుంది. వామపక్ష ఫ్రంట్‌ హ్యాట్రిక్‌ సాధించి కొత్త రికార్డు నమోదు చేసుకుంటుంది. అయితే, మే 4న ఓట్ల లెక్కింపు జరిగే ఈ ఎన్నికల్లో ఎల్డీఎఫ్‌కు విజయావకాశాలు ఎక్కువని ఈ ఏడాది మార్చి వరకూ వెల్లడైన ఎన్నికల సర్వేల్లో చాలా వరకూ అంచనా వేశాయి. పాలక ఎల్డీఎఫ్, కాంగ్రెస్‌ నాయకత్వంలోని యూడీఎఫ్‌ మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉందని ఈ సర్వేలు సూచిస్తున్నాయి. మార్చి నెలాఖరులో ప్రసిద్ధ మలయాళ దినపత్రిక మళయాళ మనోరమ మార్కెట్‌ పరిశోధనా సంస్థ సీ–ఓటర్‌తో కలిసి చేసిన ఫలితాలు అందుకు భిన్నంగా వచ్చాయి. ఈ ఎన్నికల్లో యూడీఎఫ్‌కు స్వల్ప ఆధిక్యంతో కేరళలో అధికారం మళ్లీ హస్తగతం అయ్యే సూచనలు ఉన్నాయని ఈ సర్వే సూచిస్తోంది.
*2016లో శ్రీ విజయన్‌ సీఎం కావడంతో మారిన రాజకీయ చిత్రం
2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్డీఎఫ్‌ 91 సీట్లు కైవసం చేసుకుని అధికారంలోకి వచ్చింది. సాధారణ మెజారిటీకి 71 సీట్లు అవసరం. 58 సీట్లు సొంతంగా గెలుచుకున్న సీపీఎంకు సీఎం పదవి లభించింది. కేరళ సీపీఎం నేతగా, మాజీ మంత్రిగా ఉన్న శ్రీ పినరయి విజయన్‌ తొలిసారి సీఎం గద్దెనెక్కారు. కన్నూర్‌ జిల్లాకు చెందిన శ్రీ విజయన్‌ 71 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రి కావడమేగాక వరుసగా పదేళ్లు పదవిలో కొనసాగి రికార్డు సృష్టించారు. 2006 అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్డీఎఫ్‌ విజయం సాధించాక శ్రీ విజయన్‌ సామాజికవర్గమైన ఈళవ వర్గానికే చెందిన కేరళ సీపీఎం దిగ్గజ నేత శ్రీ వీఎస్‌ అచ్యుతానందన్‌ 82 సంవత్సరాల వయసులో ముఖ్యమంత్రి పీఠమెక్కడం విశేషం. పాలక ఎల్డీఎఫ్‌కు ఈ ఎన్నికల్లో నాయకత్వం వహిస్తున్న 81 ఏళ్ల శ్రీ పినరయి విజయన్‌ ఆయన కూటమి వరుసగా మూడోసారి గెలిచినా సీఎం పదవి చేపట్టబోరని సీపీఎం ప్రకటించింది. ఒకవేళ వామపక్ష ప్రజాతంత్ర కూటమికి మెజారిటీ సీట్లు లభిస్తే సీపీఎంకు చెందిన మరో నాయకుడికి ముఖ్యమంత్రి పదవి దక్కుతుంది. 2016 ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి (కూటమిలోని మరో పార్టీ భారత్‌ ధర్మ జనసేన) మొదటిసారి అత్యధికంగా 14.6 % ఓట్లతో ఒక్క సీటు దక్కించుకుంది. దాని మిత్రపక్షం భారత్‌ ధర్మ జనసేన 4 శాతం ఓట్లు సాధించినా ఒక్క సీటూ గెలుచుకోలేక పోయింది. బీజేపీకి 10.6% ఓట్లు దక్కాయి.
*శ్రీ విజయన్‌కు రెండోసారి సీఎం పదవి ఇచ్చిన 2021 ఎన్నికలు
శ్రీ పినరయి విజయన్‌ ఐదు సంవత్సరాల పదవీ కాలం ముగుస్తున్న సమయంలో జరిగిన 2021 శాసనసభ ఎన్నికల్లో వరుసగా రెండోసారి ఎల్డీఎఫ్‌కు మెజారిటీ స్థానాలు (99) దక్కాయి. అంతకు ముందు జరిగిన ఎన్నికల్లో కంటే ఈసారి 8 సీట్లు ఎక్కువ లభించాయి. సీపీఎంకు నాలుగు సీట్లు పెరిగి 62 స్థానాలు దాని ఖాతాలో పడ్డాయి. ప్రతిపక్ష యూడీఎప్‌ కూటమికి 41 సీట్లు వచ్చాయి. గతంతో పోల్చితే ఆరు సీట్లు తగ్గాయి. దీనికి నాయకత్వం వహించే కాంగ్రెస్‌ బలంలో ఎలాంటి మార్పు లేదు. వరుసగా రెండోసారి 22 సీట్లు మాత్రమే హస్తం పార్టీ గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం స్వల్పంగా (1.42%) పెరిగి 11.30% చేరుకుంది గాని ఒక్క సీటూ దక్కలేదు. ఎల్డీఎఫ్‌ కూటమిలో సీపీఎం తర్వాత సీపీఐకి అత్యధికంగా 17 స్థానాలు లభించాయి. మొత్తం మీద ఎల్డీఎఫ్‌కు 45.43% ఓట్లు, ప్రతిపక్ష యూడీఎఫ్‌కు 39.47% ఓట్లు దక్కాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు ఓట్లు ఈసారి స్వల్పంగా తగ్గి 12.41% వచ్చాయి. శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి నిర్దిష్ట వయసులో ఉన్న మహిళల ప్రవేశానికి అనుకూలంగా వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు 2019 లోక్‌సభ ఎన్నికల్లో సీపీఎం, ఎల్డీఎఫ్‌ను దెబ్బదీశాయి. తీర్పును వామపక్షాలు సమర్ధించడమే దీనికి కారణం. కేరళలోని మొత్తం 20 లోక్‌సభ సీట్లలో ఎల్డీఎఫ్‌కు ఒకే ఒక స్థానం లభించింది. శబరిమల ఆలయ ప్రవేశం అంశంతోపాటు ఇతర రాజకీయ విషయాలు యూడీఎఫ్‌ 19 లోక్‌సభ సీట్లు గెలుచుకోవడానికి దోహదం చేశాయి. అయితే, 2018లో వచ్చిన భారీ వరదలతో కేరళ జనజీవనం అతలాకుతలం అయింది. శ్రీ విజయన్‌ నాయకత్వంలోని ఎల్డీఎఫ్‌ సర్కారు తీసుకున్న సహాయ, రక్షణ చర్యలు కేరళ ప్రజలను ఆదుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ప్రజలకు సహాయం అందించి, పునరావాస ఏర్పాట్లు చేసి అన్ని వర్గాల ప్రజల ఆదరణ పొందింది. ఇంకా 2020–2021 మధ్య కాలంలో దాదాపు ఏడాది సమయంలో కరోనా మహమ్మారి కేరళను చుట్టుముట్టినప్పుడు ప్రభుత్వం అందించిన వైద్య సహాయం, ప్రజలకు ఉపాధితోపాటు ఏ రంగంలో లోటు రాకుండా తీసుకున్న చర్యలు కూడా శ్రీ పినరయి విజయన్‌ ప్రభుత్వాన్ని ఆదుకున్నాయి. 2021 శాసనసభ ఎన్నికల్లో అధికారంలోకి రెండోసారి రావడానికి అవి దోహదం చేశాయి. మరో పక్క బంగారం దొంగ రవాణా కుంభకోణంతో సీఎం కార్యాలయంలో పనిచేసే అధికారులకు సంబంధాలున్నాయని ఆరోపణలు వచ్చాయి. వారిలో కొందరిపై కేసులు నమోదు చేసి అరెస్టు వరకూ వ్యవహారం వెళ్లింది. అయితే, కేరళ పారిశ్రామిక అభివృద్ధి, సాధారణ ప్రగతి, సంక్షేమ, వైద్య, విద్యా రంగాల్లో ఎల్డీఎఫ్‌ సాధించిన విజయాలు వరుసగా ఈ కూటమి రెండోసారి మెజారిటీ సీట్లు గెలుచుకోవడానికి తోడ్పడ్డాయి. అవినీతి విషయంలో శ్రీ పినరయి సర్కారుపై ప్రజలకు అసంతృప్తి ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో చేసిన కృషి కారణంగా రెండోసారి ఎల్డీఎఫ్‌ను గెలిపించారు. వరదల సమయంలో ఇదుక్కి, వాయనాడ్, కన్నూర్, ఎర్నాకుళం వంటి జిల్లాల్లోని ముంపు ప్రాంతాల్లో, జనం ఎక్కువ మంది నష్టపోయిన చోట్ల సీఎం శ్రీ విజయన్‌ స్వయంగా పర్యటించి సహాయ, రక్షణ కార్యక్రమాలు పర్యవేక్షించారు. పునరావాస, సహాయ శిబిరాలకు వెళ్లి దగ్గరుండి ప్రభుత్వ అధికారులు, సిబ్బందితో పనిచేయించడం ప్రజల ఆదరణ చూరగొంది.
*2024 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం యూడీఎఫ్‌కే మెజార్టీ
2016–2021 మధ్య ఐదేళ్ల పాలనా కాలంలో రాష్ట్రంలో మంచి పరిపాలన ద్వారా రెండోసారి అధికారంలోకి వచ్చిన ఎల్డీఎఫ్‌ ఇతర కారణాల వల్ల 2019 లోక్‌ సభ ఎన్నికల్లో కేవలం ఒక స్థానం మాత్రమే గెలుచుకున్నట్టే 2024 పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఏకైక సీటుతో సరిపెట్టు కోవాల్సి వచ్చింది. పార్లమెంటు ఎన్నికల్లో శ్రీ విజయన్‌ సర్కారు పనితీరు చూసి మలయాళీలు ఓటేయకపోవడం 2019 లోక్‌సభ ఎన్నికల నుంచి ఆనవాయితీగా మారింది. కిందటి 2024 పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ కూటమికి (యూడీఎఫ్‌) 18 సీట్లు రాగా, బీజేపీ తొలిసారి కేరళలో ఒక లోక్‌సభ స్థానాన్ని కైవసం చేసుకుంది. త్రిసూర్‌ స్థానం నుంచి బీజేపీ అభ్యర్ధిగా పోటీచేసిన ప్రసిద్ధ మలయాళ నటుడు శ్రీ సురేష్‌ గోపీ విజయం సాధించి సంచలనం సృష్టించారు. ఇలా ఒక లోక్‌సభ సీటును కిందటి పార్లమెంటు ఎన్నికల్లో కైవసం చేసుకోవడం, కొన్ని మాసాల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజధాని తిరువనంతపురం కార్పొరేషన్‌ను చేజిక్కింకుకోవడంతో బీజేపీకి ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో విజయావకాశాలు పెరిగాయని కాషాయపక్షం నేతలు భావిస్తున్నారు. అంతేగాక 2024 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ కూటమికి 19.26 శాతం ఓట్లు పోలయ్యాయి. అయితే, లోక్‌సభ ఎన్నికలతో పోల్చితే మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ ఓట్ల శాతం దాదాపు 15 శాతానికి పడిపోయింది.
*శ్రీ విజయన్‌ రెండో పాలనలో కీలక చర్యలు
2021 మే నెలలో మొదలైన శ్రీ విజయన్‌ రెండో పాలనా కాలంలో ఎల్డీఎఫ్‌ సర్కారు ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుని అమలు చేసింది. పాలన, ఆర్థిక వ్యవస్థ, సామాజిక సంక్షేమం విషయంలో చెప్పుకోదగిన మార్పులు తీసుకొచ్చింది. రెండోసారి అధికారం చేపట్టిన మాసంలోనే తీవ్ర లేదా కటిక పేదరిక నిర్మూలన కార్యక్రమం చేపట్టి దేశంలోనే ఈ రంగంలో మొదటిస్థానం సంపాదించింది. కేరళలో తీవ్ర పేదరికాన్ని గణనీయంగా తగ్గించగలిగారని నీతి ఆయోగ్‌ ధ్రువీకరించింది. కటిక దారిద్య్రాన్ని కేరళలో దాదాపు పూర్తిగా నిర్మూలించగలిగామని సీఎం శ్రీ విజయన్‌ కిందటేడాది నవంబర్‌ ఒకటిన 69వ రాష్ట్ర అవతరణ సందర్భంగా ప్రకటించారు. అనేక రంగాల్లో ప్రగతి సాధించినప్పటికీ ఎల్డీఎఫ్‌ హయాంలో అవినీతి పెరిగిందనే ఆరోపణలు కూడా వచ్చాయి. కొచ్చిన్‌ మినరల్స్‌ అండ్‌ రూటైల్‌ లిమిటెడ్‌ (సీఎంఆర్‌ఎల్‌) 2023లో శ్రీ విజయన్‌ కుమార్తెకు చెందిన కంపెనీ ఎక్సాలాజిక్‌ సొల్యూషన్స్‌కు ముడుపులు ఇచ్చిందనే అభియోగం సర్కారును ఇరుకున పెట్టింది. తన కూతురు కంపెనీకి రూ.2.7 కోట్ల ముడుపులు ముట్టాయనే ఆరోపణ రాజకీయ దురద్దేశంతో చేసినదని శ్రీ విజయన్‌ కొట్టివేసినా జనంలో అనుమానాలు మిగిలే ఉన్నాయి. ఇటీవల శబరిమల ఆలయంలో బంగారు అభరణాల చోరీ అంశం కూడా శ్రీ విజయన్‌ సర్కారుకు మాయని మచ్చలా కనిపిస్తోంది. అయితే, ఈ–సేవనం, కేరళ ఫైబర్‌ ఆప్టిక్‌ నెట్‌వర్క్‌ (కే–ఫాన్‌) పోర్టల్స్‌ ద్వారా 900కు పైగా ఆన్‌లైన్‌ సర్వీసులు అందుబాటులోకి రావడంతో దేశంలోనే పూర్తిస్థాయి ఈ–పరిపాలన సాగుతున్న రాష్ట్రంగా కేరళ గుర్తింపు సాధించింది. గత పది సంవత్సరాల కాలంలో వివిధ రంగాల్లో అనేక విజయాలతోపాటు అవకతవకలు తోడవడంతో ఈ ఎన్నికల్లో కేరళ ప్రజలు రెండు ప్రధాన కూటముల్లో దేన్ని ఎన్నుకుంటారనేది కీలక ప్రశ్నగా మారింది.
*కాంగ్రెస్‌ నేతృత్వంలో పదేళ్లు యూడీఎఫ్‌ రాజకీయ పోరాటం
అంతర్గత కలహాలకు మారుపేరైన కాంగ్రెస్‌ వరుసగా రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. కాని పదేళ్లు కీలక ప్రతిపక్ష పాత్ర పోషించే క్రమంలో ఈ పార్టీ ప్రజా ఉద్యమాలతో దూకుడు పెంచుతూ వస్తోంది. శాసనసభ ఎన్నికల్లో ఓడినాగాని వరుసగా రెండు లోక్‌సభ ఎన్నికల్లో (2019, 2024), ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో సాధించిన విజయాలు కాంగ్రెస్‌ పార్టీ నేతల్లో గెలుపు ఆశను సజీవంగా నిలిపాయి. గత రెండు పార్లమెంటు ఎన్నికల్లో కేరళలోని వాయనాడ్‌ నుంచి పార్టీ అగ్రనేత శ్రీ రాహుల్‌ గాంధీ లోక్‌సభకు ఎన్నికవడం, రెండోసారి ఆయన రాజీనామాతో 2024లో జరిగిన ఉప ఎన్నికలో ఆయన సోదరి శ్రీమతి ప్రియాంకా గాంధీ వాడ్రా అక్కడ నుంచి గెలవడంతో గాంధీ–నెహ్రూ పరివారం దృష్టి కేరళలో అధికారం మళ్లీ కైవసం చేసుకోవడంపై నిలిచింది. తిరువనంతపురం నుంచి వరుసగా నాలుగుసార్లు లోక్‌సభకు ఎన్నికైన కాంగ్రెస్‌ మాజీ కేంద్ర మంత్రి శ్రీ శశి థరూర్‌ ఆ మధ్య కొంత కాలం ప్రధాని శ్రీ నరేంద్ర మోదీకి, ఎన్డీఏ సర్కారుకు దగ్గరయ్యే విధంగా మాట్లాడడం, వ్యవహరించడం కొంత వరకు కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టిన మాట నిజమే. అయితే, ఆయన స్థానిక సంస్థల ఎన్నికల నుంచీ కాంగ్రెస్‌లో, ఈ ఎన్నికల్లో పార్టీ తరఫున కీలక పాత్ర పోషించడం అనుకూల అంశం. శ్రీ రాహుల్, శ్రీమతి ప్రియాంక తరచు కేరళ పర్యటనకు వచ్చి ఎల్డీఎఫ్‌పై విమర్శనాస్త్రాలు సంధించడమేగాక కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు పోరాట పటిమతో ముందుకు కదిలే విధంగా కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ సంస్థాగత విషయాల్లో, పార్లమెంటులో శ్రీ రాహుల్‌ గాంధీకి అత్యంత సన్నిహితుడైన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ శ్రీ కేసీ వేణుగోపాల్‌ కేరళకు చెందిన బడా నేత కావడం కూడా కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో అనుకూల అంశం. బహిరంగంగా ప్రకటించనప్పటికీ కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థి శ్రీ వేణుగోపాల్‌ అనే ప్రచారం కూడా జరిగింది. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమన్వయం వంటి కీలక అంశాలను పర్యవేక్షించేది శ్రీ వేణుగోపాల్‌ అనే విషయం తెలిసిందే.
*కీలక స్థానాలపై దృష్టి
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ తీవ్రంగా ఉంది. అయితే, ఐదారు కీలక నియోజకవర్గాలపై రాష్ట్ర ప్రజలు, రాజకీయ పరిశీలకుల దృష్టి కేంద్రీకృతమై ఉంది. తిరువనంతపురం జిల్లాలోని నేమామ్‌ స్థానంలో పోటీ రెండు ప్రధాన కూటములతోపాటు ఎన్డీఏకు కూడా ఇప్పుడు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారింది. పారిశ్రామికవేత్త, కేంద్ర మాజీ మంత్రి, మీడియా సంస్థ అధినేత, కేరళ బీజేపీ అధ్యక్షుడు శ్రీ రాజీవ్‌ చంద్రశేఖర్‌ బీజేపీ టికెట్‌పై ఈసారి ఇక్కడ బరిలోకి దిగారు. ఆయనపై ప్రస్తుత ఎమ్మెల్యే, మంత్రి శ్రీ వి.శివన్‌ కుట్టి, కాంగ్రెస్‌ నేత కేఎస్‌ శబరినాథన్‌ పోటీ చేస్తున్నారు. గతంలో అనేకసార్లు రాజ్యసభకు ఎన్నికైన శ్రీ రాజీవ్‌ నేమామ్‌లో గెలుపునకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. 2016లో కేరళలో బీజేపీ గెలుచుకున్న ఏకైక స్థానం నేమామ్‌ కావడం విశేషం. అలాగే, త్రిసూర్‌ అసెంబ్లీ స్థానంలో బీజేపీ తరఫున కాంగ్రెస్‌ మాజీ సీఎం శ్రీ కె.కరుణాకరన్‌ కుమార్తె శ్రీమతి పద్మజా వేణుగోపాల్‌ పోటీలో ఉండడంతోపాటు కిందటి ఎన్నికల్లో ఇక్కడ స్వల్ప మెజారిటీతో విజేత ఎన్నికవడం దీనిపై ఆసక్తికి ప్రధాన కారణం. ఎల్డీఎఫ్, యూడీఎఫ్‌ కూడా బలమైన అభ్యర్ధులను నిలబెట్టాయి. మంజేశ్వరం స్థానం కూడా స్వల్ప మెజారిటీతో అభ్యర్ధులు గెలిచే స్థానాల్లో ఒకటి. ఇక్కడ యూడీఎఫ్‌ మద్దతుతో పోటీచేస్తున్న స్వంతంత్ర అభ్యర్థి శ్రీ ఏకేఎం అష్రఫ్, శ్రీ కె.సురేంద్రన్‌ (బీజేపీ), శ్రీ కేఆర్‌ జయనంద (సీపీఎం) బరిలో ఉన్నారు. మరో కీలక స్థానం పాలక్కాడ్‌లో ఎల్డీఎఫ్‌ మద్దతుతో పోటీలోకి దిగిన స్వతంత్ర అభ్యర్థి ఎన్‌ఎంఆర్‌ రజాక్, రమేష్‌ పిషార్డీ (యూడీఎఫ్‌), శోభా సురేంద్రన్‌ (ఎన్డీఏ) పోటీ పడుతున్నారు. ఇంకా మాజీ సీఎం శ్రీ కరుణాకరన్‌ కుమారుడు, పీసీసీ మాజీ నేత, మాజీ ఎంపీ శ్రీ కె.మురళీధరన్‌ పోటీలో ఉన్న వట్టియూర్కావు కూడా తీవ్ర పోటీ జరుగుతున్న స్థానాల్లో ఒకటి. ఆయనపై సిటింగ్‌ సీపీఎం ఎమ్మెల్యే వీకే ప్రశాంత్, బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన మాజీ ఐపీఎస్‌ అధికారి ఆర్‌ శ్రీలేఖ పోటీలో ఉన్నారు. బీజేపీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి వి.మురళీధరన్‌ పోటీ చేస్తున్న కాళకూట్టం, మాజీ మంత్రి, సీపీఎం నాయకురాలు కేకే శైలజ బరిలోకి దిగిన పేరావూర్, యూడీఎఫ్‌కు కంచుకోట అయిన ఎర్నాకుళంలో కూడా ఈసారి పోటీ మూడు కూటముల మధ్య తీవ్రంగా ఉంది. సీఎం శ్రీ విజయన్‌ ఎప్పటి మాదిరిగానే ధర్మాదం నుంచి, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌ నాయకుడు శ్రీ వీడీ సతీశన్‌ పరావూర్‌ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ముందే చెప్పుకున్నట్టు మలయాళ మనోరమ పత్రిక సీ–ఓటర్‌తో కలిసి జరిపిన ఎన్నికల సర్వే ప్రకారం కాంగ్రెస్‌ నాయకత్వంలోని యూడీఎఫ్‌కు 69 నుంచి 81 సీట్లు, ఎల్డీఎఫ్‌కు 57 నుంచి 69 స్థానాలు దక్కే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అయితే, పోటీ రెండు కూటముల మధ్య నువ్వా, నేనా అన్నట్టు ఉందని, ఎన్నికల ముందు అంచనాలు ఓట్ల లెక్కింపు రోజు తారుమారు కావచ్చని కూడా ఎన్నికల విశ్లేషకులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.