
- “ఏకా – ది వన్” జాతీయ స్థాయి సంచార చిత్ర ప్రదర్శనపై మంత్రి కందుల దుర్గేష్ ప్రశంసలు
విజయవాడ: విజయవాడ ఎంజీ రోడ్డులోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో (చుక్కపల్లి పిచ్చయ్య ఆడిటోరియం) ఏర్పాటు చేసిన “ఏకా – ది వన్” జాతీయ స్థాయి సంచార చిత్ర ప్రదర్శనను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ మంగళవారం సందర్శించారు.
ప్రముఖ కళాకారిణి డాక్టర్ బీనా ఉన్నికృష్ణన్ రూపొందించిన 64 యోగిని చిత్రాలను ఆయన ఆసక్తిగా తిలకించి వాటి ప్రత్యేకతలను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రదర్శనలో ప్రధాన ఆకర్షణగా నిలిచిన ‘వారాహి’ యోగిని చిత్రపటాన్ని మంత్రి దుర్గేష్ ప్రత్యేకంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాహనం పేరు కూడా ‘వారాహి’ కావడంతో, ఈ చిత్రపటం పట్ల సహజంగానే అందరిలో ఆసక్తి నెలకొందన్నారు. “వారాహి అమ్మవారు భయాన్ని, పరధ్యానాన్ని ఛేదించే ఒక గొప్ప రక్షక శక్తి. ఆమె అచంచలమైన ధైర్యానికి, స్పష్టతకు నిదర్శనమన్నారు. “లక్ష్య సాధనలో వారాహి చూపించే ఏకాగ్రత, ప్రతికూలతలను ఎదుర్కొనే తీరును ఈ చిత్రంలో అత్యద్భుతంగా ఆవిష్కరించారని కొనియాడారు.
అదే విధంగా మిగితా కళాఖండాలపై మంత్రి దుర్గేష్ ప్రశంసలు కురిపించారు. భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని, తంత్ర విద్యలోని లోతును నేటి తరానికి పరిచయం చేసేలా ఈ ప్రదర్శన ఉందని మంత్రి కొనియాడారు. ప్రపంచంలోనే ఒకే కళాకారిణి 64 మంది యోగినీలను పూర్తిస్థాయి సమకాలీన చిత్రాలుగా రూపొందించడం ఇదే మొదటిసారి అని ఆయన అన్నారు..
ప్రతి యోగిని స్వరూపం ఒక విశిష్టమైన స్త్రీ శక్తికి ప్రతిరూపమని, సమాజంలోని చెడును కడిగివేసే సందేశం ఈ చిత్రాల్లో ఉందని పేర్కొన్నారు. కళారంగంలో లింగ వివక్ష లేని సమాజం కోసం, వెనుకబడిన కళాకారుల సాధికారత కోసం కృషి చేస్తున్న డాక్టర్ బీనా ఉన్నికృష్ణన్ను మంత్రి దుర్గేష్ అభినందించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక సృజనాత్మక సమితి చైర్ పర్సన్ తేజస్వి పొడపాటి ఈ చిత్రాల విశిష్టతను వివరించారు.
ఈ సందర్భంగా ఆమెను మంత్రి దుర్గేష్ ప్రత్యేకంగా అభినందించారు. లోక కళ్యాణార్థం సమాజంలో కుళ్ళను కడిగి వేయడం, సమస్యలు, చెడును అధిగమిచడం తదితర ఉద్దేశ్యంతో మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనను ప్రతి ఒక్కరూ తప్పక సందర్శించాలని మంత్రి దుర్గేష్ పిలుపునిచ్చారు. ప్రాచీన ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని నేటి సామాజిక సంభాషణ లోకి తీసుకువచ్చే ఒక సమకాలీన కళాత్మక వివరణగా మంత్రి దుర్గేష్ అభివర్ణించారు.
ఈ సందర్భంగా యోగిని కాళీ, వారాహి, గంగ, కామాక్షి, మహేశ్వరీ, మాతంగి, జాంబవతి, విరాజ, గౌరీ, వరుణి, యమున, నర్మద, తార, చండి, కాత్యాయనీ, మహాలక్ష్మి తదితర అన్ని చిత్రాలను ఆసక్తిగా తిలకించారు.. శక్తి స్వరూపిణీ పాత్రలు పోషించే తీరును ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ గుర్తు చేసుకున్నారు..
ఈ సంచార ప్రదర్శన 16 రాష్ట్రాల్లో, 81 రోజుల పాటు, 10 వేల కిలోమీటర్ల మేర సాగుతుందని కళాకారిణి ఉన్ని కృష్ణన్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ఈ ప్రదర్శన జరుగుతున్న 15వ రాష్ట్రమన్నారు. మంత్రి కందుల దుర్గేష్ ఈ ప్రదర్శనకు వచ్చి తన విలువైన సందేశాన్ని ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర సాంస్కృతిక, సృజనాత్మక సమితి చైర్ పర్సన్ పాల్గొన్నారు.