ఏపీలో మహిళా మత్స్య సహకార సంఘాలకు కేంద్రం ప్రోత్సాహం

  1. రాజ్యసభలో ఎంపీ సానా సతీష్ బాబు ప్రశ్నకు సమాధానం

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో మహిళల ఆధ్వర్యంలో నడుస్తున్న మత్స్య సహకార సంఘాల ప్రస్తుత పరిస్థితి, వాటి ద్వారా మహిళలకు అందుతున్న ప్రయోజనాలు, భవిష్యత్ అభివృద్ధి కార్యాచరణపై రాజ్యసభలో ఎంపీ సానా సతీష్ బాబు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

తీరప్రాంత మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మత్స్య సహకార సంఘాల సంఖ్య, వాటిలో సభ్యులుగా ఉన్న మహిళల వివరాలు, సముద్రపు ఆల్గీ (సీవీడ్) సాగు, మెరైన్ ప్రాసెసింగ్ రంగాల్లో మహిళల భాగస్వామ్యం, వారి సామాజిక-ఆర్థిక పరిస్థితులపై వివరాలు వెల్లడించాలని కేంద్రాన్ని కోరారు.

దీనికి సమాధానంగా కేంద్ర మత్స్యశాఖ మంత్రి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 213 మహిళా మత్స్య సహకార సంఘాలు పనిచేస్తున్నాయని తెలిపారు. ఈ సంఘాల ద్వారా రాష్ట్రంలోని 12 జిల్లాల్లో మొత్తం 27,447 మంది మహిళలు లబ్ధి పొందుతున్నారని వెల్లడించారు. 2021 ఏప్రిల్ 1 నుంచి 2026 జూన్ 15 వరకు ఏర్పాటైన సంఘాల జిల్లా వారీ వివరాలను కూడా సభలో సమర్పించినట్లు తెలిపారు.

మహిళల ఆధ్వర్యంలోని మత్స్య సహకార సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని మంత్రి వివరించారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద మహిళలకు అధిక ప్రోత్సాహకాలు, జాతీయ మత్స్య డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో నమోదు, సామర్థ్యాభివృద్ధి శిక్షణ, ఆర్థిక సహాయం, మార్కెట్ అనుసంధానం వంటి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

అదనంగా దేశవ్యాప్తంగా 12 వేల మత్స్య సహకార సంఘాలను బలోపేతం చేయడానికి జాతీయ కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ చర్యల ద్వారా మహిళల ఆదాయం పెరగడంతో పాటు మత్స్య రంగంలో వారి పాత్ర మరింత బలపడుతుందని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడింది.

రాజ్యసభలో ఈ అంశాన్ని ప్రస్తావించిన ఎంపీ సానా సతీష్ బాబు, తీరప్రాంత మహిళలకు మరింత ఉపాధి అవకాశాలు, ఆర్థిక స్వావలంబన కల్పించేలా కేంద్రం తీసుకుంటున్న చర్యలు సమర్థవంతంగా అమలయ్యేలా కృషి చేయాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.