
అమలాపురం: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఏర్పడిన అంతరాయాలను దృష్టిలో ఉంచుకొని ఆయిల్ కంపెనీలతో సమన్వయం చేస్తూ పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడం జరుగుతోందని జాయింట్ కలెక్టర్ వైకోం నిధియా దేవి తెలిపారు.
కలెక్టరేట్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలో 110 బంకుల్లో 10 బంకులు తాత్కాలికంగా మూతపడ్డాయని, అవి త్వరలో తిరిగి ప్రారంభించబడతాయని తెలిపారు. ప్రస్తుతం బంకుల్లో తగినంత పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయని వివరించారు.
అత్యవసర సేవలు అయిన అంబులెన్స్‌లు, ప్రజా రవాణా, నీటి సరఫరా, పాలు, గ్యాస్ వాహనాలకు నిరంతర ఇంధన సరఫరా కొనసాగుతుందని స్పష్టం చేశారు. వ్యవసాయ అవసరాల కోసం తహసీల్దార్ సిఫారసుల ఆధారంగా కూపన్ల ద్వారా డీజిల్ అందిస్తామని తెలిపారు.
పెట్రోల్ బంకుల్లో డ్రమ్ములు, క్యాన్లు, బాటిళ్లలో ఇంధనం నింపడం పూర్తిగా నిషేధించబడిందని చెప్పారు. బ్లాక్ మార్కెట్, కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రజలు భయాందోళనకు గురికాకుండా సహకరించాలని, సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చేసే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా అంతటా పోలీసు పర్యవేక్షణ పెంచినట్లు పేర్కొన్నారు.