
నటుడు, ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీ చీఫ్ విజయ్కు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం ఆయన దాఖలు చేసిన నామినేషన్ అఫిడవిట్‌లోని ఆర్థిక వివరాలపై విచారణ జరపాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.
చెన్నైకి చెందిన ఎంపీ వెంకటేశ్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. పెరంబూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విజయ్ తన ఫారం-26 అఫిడవిట్‌లో ఆర్థిక వివరాలను తప్పుగా చూపారని, కొన్ని కీలక అంశాలను దాచిపెట్టారని ఆరోపించారు. కుటుంబ సభ్యులకు, అనుబంధ సంస్థలకు కోట్ల రూపాయల రుణాలు ఇచ్చినట్లు చూపిస్తూ, తనకు అప్పులు లేవని పేర్కొనడం అనుమానాస్పదమని అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా భార్యకు రూ.12 కోట్లకు పైగా రుణం ఇచ్చినట్లు పేర్కొనడం ప్రశ్నార్థకమని తెలిపారు.
ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951 సెక్షన్ 33ఏ ప్రకారం అభ్యర్థులు పూర్తి పారదర్శక సమాచారాన్ని వెల్లడించాల్సి ఉంటుందని, కానీ విజయ్ సమర్పించిన వివరాలు ఓటర్లకు సరైన సమాచారం అందకుండా చేస్తున్నాయని పిటిషనర్ వాదించారు. ఈ వ్యవహారంపై ఆదాయపు పన్ను శాఖ, కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఎన్నికల సంఘంతో ప్రాథమిక విచారణ జరపాలని కోరారు.
అయితే ఈ పిటిషన్‌ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి సంజయ్ వి. గంగాపూర్వాలా, జస్టిస్ అరుళ్ మురుగన్ల ధర్మాసనం, పిటిషన్‌ను విచారణకు స్వీకరించకుండానే తిరస్కరించింది.
కాగా, విజయ్ ఎన్నికల అఫిడవిట్‌పై మరో పిటిషన్ ఇప్పటికే కోర్టులో విచారణలో ఉంది. అందులో రూ.100 కోట్లకు పైగా వివరాలు వెల్లడించలేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కోర్టు కేంద్ర ఎన్నికల సంఘం, ఆదాయపు పన్ను శాఖకు నోటీసులు జారీ చేయడం గమనార్హం. 2024లో విజయ్ ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీని స్థాపించి, 2026 ఎన్నికల్లో పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే.