
తిరుపతి: జిల్లా చంద్రగిరి సమీపంలోని ఎర్రవారిపాలెం ప్రాంతంలో ఏనుగుల గుంపు సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేసి, వారికి ధైర్యం కల్పించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ అటవీశాఖ అధికారులను ఆదేశించారు.
శేషాచలం అటవీ ప్రాంతంలోని ఏనుగులు రెండు గుంపులుగా సంచరిస్తూ రాత్రివేళ అటవీ సరిహద్దుల్లోని పంట పొలాలను ధ్వంసం చేస్తున్నట్లు వచ్చిన సమాచారంపై పవన్ కళ్యాణ్ అటవీశాఖ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏనుగుల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తూ డ్రోన్ల సహాయంతో వాటి సంచార మార్గాలను గుర్తించాలని సూచించారు.
అటవీ సమీప గ్రామాల్లో రాత్రివేళ ప్రత్యేక గస్తీ పెంచడంతో పాటు, రెవెన్యూ, పోలీసు, అటవీశాఖలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని ఆదేశించారు. గ్రామాల్లో మైకులు, మొబైల్ సందేశాలు, స్థానిక సమాచార వ్యవస్థల ద్వారా ప్రజలకు హెచ్చరికలు జారీ చేయాలని తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రజలు రాత్రివేళ పొలాలకు వెళ్లకుండా అవగాహన కల్పించాలని సూచించారు.
పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన ప్రాంతాల్లో హనుమాన్ (H.A.N.U.M.A.N.) బృందాలను మోహరించి ప్రజల భద్రతకు చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది 24 గంటలు అప్రమత్తంగా ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఏనుగుల కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటూ అటవీశాఖ అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.
ఏనుగులు పంట పొలాలను ధ్వంసం చేసిన నేపథ్యంలో పంట నష్టంపై అధికారులు నివేదికలు సిద్ధం చేసిన వెంటనే అటవీశాఖ ద్వారా తక్షణ పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ తెలిపారు. చంద్రగిరి సమీపంలోని ఎర్రవారిపాలెం వద్ద ఏనుగుల గుంపు సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అటవీశాఖ అధికారులను ఆదేశించారు. డ్రోన్లతో ఏనుగుల కదలికలపై నిఘా, రాత్రివేళ గస్తీ పెంపు, రెవెన్యూ, పోలీసు శాఖల సమన్వయంతో హెచ్చరికలు జారీ చేయాలని సూచించారు