
మార్కాపురం: కలెక్టరేట్లో ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పి.జి.ఆర్.ఎస్)ను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత తెలిపారు. ప్రజల సమస్యలను స్వీకరించి వాటికి పరిష్కారం చూపడంతో పాటు పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం, సేవల నాణ్యత, పౌరుల సంతృప్తి స్థాయిలను పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
అర్జీదారులు తమ సమస్యలను అధికారిక వెబ్సైట్ Meekosam.ap.gov.in ద్వారా నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. అర్జీ నమోదు, దాని స్థితి, ఇతర వివరాల కోసం 1100 కాల్ సెంటర్ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం సిటిజన్ ఫీడ్బ్యాక్ క్యూఆర్ కోడ్ను అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, పి.జి.ఆర్.ఎస్ కేంద్రాలు, పౌర సేవా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ను ఫిర్యాదుదారులు స్కాన్ చేసి తమ సమస్య పరిష్కారంపై అభిప్రాయాన్ని నమోదు చేయవచ్చని తెలిపారు. ఈ ఫీడ్బ్యాక్ ఆధారంగా సేవల నాణ్యతను మరింత మెరుగుపరచేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
పి.జి.ఆర్.ఎస్ కార్యక్రమం సజావుగా నిర్వహించేందుకు అర్జీ స్వీకరణ కౌంటర్లు, రిసెప్షన్ సదుపాయం, జిల్లా, మండల స్థాయి అధికారుల హాజరు, వికలాంగులకు ప్రత్యేక సౌకర్యాలు, తాగునీటి వసతి, అర్జీల పర్యవేక్షణ వంటి ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ వివరించారు. జిల్లా, మండల స్థాయి పి.జి.ఆర్.ఎస్ కేంద్రాల్లో కూడా సిటిజన్ ఫీడ్బ్యాక్ క్యూఆర్ కోడ్లను ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు.
ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని, సమస్య పరిష్కారమైన అనంతరం క్యూఆర్ కోడ్ ద్వారా తమ అభిప్రాయాలను నమోదు చేసి ప్రజా సేవల నాణ్యతను మరింత మెరుగుపరచేందుకు సహకరించాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత విజ్ఞప్తి చేశారు.