యువతని ప్రభావశీలమైన నాయకులుగా మలచడమే లక్ష్యం – శ్రీ పవన్ కళ్యాణ్ గారు…
సమాజానికి ఏదో చేయాలన్న తపన ఉన్న యువతని ప్రభావశీలమైన, శక్తివంతమైన నాయకులుగా మలచిరాబోయే తరాలకి అందించాలన్న లక్ష్యంతో జనసేన పార్టీ ప్రెసిడెంట్స్ లీడర్‌షిప్ ప్రోగ్రామ్‌ని ప్రారంభించినట్టు జనసేన పార్టీ అధినేత శ్రీ పవవన్‌కళ్యాణ్ గారు తెలిపారు. భవిష్యత్ నాయకుల్ని తయారుచేయడమే ఈ ప్రోగ్రాం ఉద్దేశమని స్పష్టం చేశారు.
సామాజిక బాధ్యతతో బలమైన పాలన విధానాలు రావాలని తపించే యువతకి ఆహ్వానం పలికారు. మంగళవారం రాత్రి హైదరాబాద్ మాదాపూర్‌లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెసిడెంట్స్ లీడర్‌షిప్ ప్రోగ్రామ్‌ని శ్రీ పవన్‌కళ్యాణ్ గారు ప్రారంభించారు. నర్సీపట్నంకు చెందిన లాలం జోగినాయుడుని ఈ ప్రోగ్రాంకి కన్వీనర్‌గా నియమించారు. మరో ఐదుగురు సభ్యులకి కో ఆర్డినేటర్లుగా బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్బంగా శ్రీ పవన్‌కళ్యాణ్ గారు మాట్లాడుతూ.. జనసేన పార్టీకి సంబంధించిన అన్ని విభాగాల్లో నవ యువనాయకత్వాన్ని తీసుకొచ్చే క్రమంలో భాగంగా పబ్లిక్ పాలసీలపై అవగాహనతో ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగాలు వదిలి సొంత ఊళ్లలో పని చేయాలన్న ఆకాంక్ష ఉన్నవారిని ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా ఈ ప్రోగ్రామ్‌ని ప్రారంభించాం. గత రెండు సంవత్సరాలుగా జనసేన పార్టీ కోసం వీరంతా వాలంటీర్లుగా పనిచేస్తున్నారు. అంతా విభిన్న నేపథ్యాల నుంచి, విభిన్న సామాజిక వర్గాల నుంచి వచ్చారు. జనసేన పార్టీ పాలసీల రూపకల్పనలో వీరంతా సహాయ సహకారాలు అందించారు. వీరందర్నీ ప్రెసిడెంట్స్ లీడర్‌షిప్ ప్రోగ్రాం కిందికి తీసుకువస్తున్నాం. విదేశాల్లో ఉంటూ దేశానికి, సొంత రాష్ట్రాలకి ఏదైనా చేద్దామన్న తపన ఉన్నవారిని ఆహ్వానిస్తున్నాం. దేశానికి యువనాయకత్వం అవసరం ఉంది. ఈ రోజు చేస్తున్న ఈ ప్రయత్నం భవిష్యత్ తరాల కోసమే. వ్యక్తిత్వం, సమాజానికి సేవ చేయాలన్న ఆకాంక్ష ఉన్న నాయకుల అవసరం ఉంది. ప్రస్తుతం ఉన్న పార్టీలు వారసత్వ రాజకీయాలని మాత్రమే ప్రోత్సహిస్తున్నాయి. కొత్త వారిని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో జనసేన పార్టీ తరఫున ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని” తెలిపారు.