కట్టె కాలేంత వరకు పవన్ కళ్యాణ్‌తోనే.. తనీష్ ఎమోషనల్ పోస్ట్

టాలీవుడ్ నటుడు తనీష్ అల్లాడి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల నిర్వహించిన ‘జనసేన సాధక్’ సమావేశంలో పాల్గొనేందుకు మంగళగిరికి వచ్చిన తనీష్, అనంతరం పవన్ కళ్యాణ్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

గత కొంతకాలంగా తెలంగాణ జనసేన విభాగంలో చురుకుగా పనిచేస్తున్న తనీష్, ఈ భేటీ అనంతరం సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టు చేశారు. “ఏం కావాలి ఇంతకన్నా.. చాలు ఈ జన్మకి. కట్టె కాలేంత వరకు మీతోనే కళ్యాణ్ సర్” అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

సినీ పరిశ్రమలో 27 ఏళ్లుగా ఉన్నప్పటికీ, పవన్ కళ్యాణ్‌ను వ్యక్తిగతంగా కలవడం ఇదే తొలిసారి అని తనీష్ వెల్లడించారు. “ఆయన్ను చూడగానే కొన్ని క్షణాలు మాటలు రాలేదు. ఈ భేటీ జీవితాంతం గుర్తుండిపోతుంది. ‘మనం కలిసి పనిచేద్దాం’ అని ఆయన చెప్పిన ఒక్క మాటే నాకు ఎంతో ప్రేరణ ఇచ్చింది” అని పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్ నిజాయితీ, సిద్ధాంతాలకు ఆకర్షితుడై గత ఏడాది నుంచి తెలంగాణలో జనసేన పార్టీ కోసం పనిచేస్తున్నానని తనీష్ తెలిపారు. ఈ సందర్భంగా తనకు ప్రోత్సాహం అందిస్తున్న జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, నిర్మాత రామ్ తాళ్లూరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం జనసేన తరఫున నిరంతరం పనిచేస్తానని తనీష్ స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్‌తో కలిసి దిగిన ఫొటోలను కూడా సోషల్ మీడియాలో పంచుకోగా, అవి ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.