తమిళనాట హోరాహోరీ!

*నువ్వా నేనా అంటున్న డీఎంకే, ఏఐఏడీఎంకే కూటములు
* టీవీకే ఆశలన్నీ యువతపైనే….

దక్షిణాదిలో అతి పెద్ద రాష్ట్రమైన తమిళనాడు అసెంబ్లీ 17వ ఎన్నికలు తీవ్ర ఉత్తంఠ రేకెత్తిస్తున్నాయి. శ్రీ ఎంకే స్టాలిన్‌ నాయకత్వంలోని డీఎంకే ప్రభుత్వానికి జనాదరణ ఉందని, ఏప్రిల్‌ 23న ఒకే దశలో జరిగే పోలింగ్‌లో మెజారిటీ తమిళ ఓటర్లు మరోసారి పాలక కూటమికి ఓటేస్తారని ఎన్నికలకు ముందు జరిపిన కొన్ని సర్వేలు సూచించాయి. డీఎంకే కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల పంపిణీ కూడా సాఫీగా సాగింది. అంతేగాక, అన్నాడీఎంకే పూర్వ ముఖ్యమంత్రి శ్రీ ఓ పన్నీర్‌సెల్వం (ఓపీఎస్‌) ఎన్నికలకు ముందు డీఎంకేలో చేరడం పాలక కూటమికి అనుకూలాంశం. రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు, పూర్వ ఐపీఎస్‌ అధికారి శ్రీ పి.అన్నామలైని ఈ ఎన్నికల్లో పోటీకి దింపక పోవడం, ఏఐఏడీఎంకే–బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు మొదట సజావుగా జరగక పోవడం వంటి అంశాలు మే 4న ఓట్ల లెక్కింపు జరిగే ఈ ఎన్నికల్లో డీఎంకే కూటమికి విజయావకాశాలు ఉన్నాయనే అంచనాలకు బలాన్నిచ్చాయి. అయితే ఐదేళ్లుగా అధికారంలో ఉండడం వల్ల డీఎంకే సర్కారుపై జనంలో వచ్చిన వ్యతిరేకత, ప్రతిపక్షంలో ఉన్నా ఏఐఏడీఎంకే సంస్థాగత నిర్మాణం ఇప్పటికీ బలంగా ఉండడం, తాజా సర్వేల్లో రెండు కూటముల మధ్య పోటీ తీవ్రంగా ఉందని, ఫలితాలపై ముందస్తు అంచనాలు తారుమారు కావచ్చనే విశ్లేషణలు రావడం వల్ల డీఎంకే కూటమికి ఈసారి గెలుపు నల్లేరుపై నడక కాదని, పోటీ ఉత్తంఠభరితంగా ఉంటుందని ఎన్నికల విశ్లేషకులు చెబుతున్నారు. అనేక దశాబ్దాలపాటు తండ్రి, డీఎంకే దిగ్గజం శ్రీ ఎం.కరుణానిధి నీడన పనిచేయడం శ్రీ స్టాలిన్‌కు సానుకూల అంశం. 68 ఏళ్ల వయసులో 2021లో రాష్ట్ర సీఎం పదవిని శ్రీ స్టాలిన్‌ మొదటిసారి చేపట్టారు. ఆయన కేబినెట్‌లోని కొందరు మంత్రులపై అంటిన అవినీతి మరకలు, నెమ్మదిగా తమిళనాట పెరుగుతున్న హిందుత్వ ప్రభావం, ఇక్కడ బాగా బలపడి అధికారం సంపాదించాలనే పట్టుదల బీజేపీ కేంద్ర నాయకత్వంలో పెరగడం వంటి కారణాలు ఈ ఎన్నికల్లో డీఎంకే గెలుపు అంత తేలిక కాదనే వాస్తవాన్ని గుర్తు చేస్తున్నాయి. 1967లో డీఎంకే మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ జనాకర్షక పథకాలకు పెట్టింది పేరైన తమిళనాట ఈసారి కూడా రెండు ప్రధాన కూటములూ అనేక ప్రజాకర్షక పథకాలతో ఓటర్ల ముందుకు వచ్చాయి.
*పాలకపక్షాన్ని ఓడించే ఆనవాయితీ 2016లో తప్పింది!
అన్నాడీఎంకే స్థాపకుడు, అగ్రశ్రేణి తమిళ సినీ హీరో, మాజీ సీఎం శ్రీ ఎంజీ రామచంద్రన్‌ మరణానంతరం 1989 జనవరి అసెంబ్లీ ఎన్నికల నుంచి 2011 శాసనసభ ఎన్నికల వరకూ ప్రతిసారీ పాలక కూటమిని ఓడించడం తమిళ ఓటర్లకు సాంప్రదాయంగా మారింది. అయితే సినీనటి, ఎంజీఆర్‌ వారసురాలు, ఏఐఏడీఎంకే నాయకురాలు జె.జయలలిత బతికి ఉండగా జరిగిన చివరి ఎన్నికల్లో (2016) మాత్రం రాష్ట్ర ప్రజలు ఈ ఆనవాయితీకి స్వస్తి పలికి పాలకపక్షమైన అన్నాడీఎంకేకు వరుసగా రెండోసారి మెజారిటీ సీట్లు ఇచ్చి గెలిపించారు. 2016 మేలో చివరిసారి సీఎం అయిన జయలలిత అదే ఏడాది డిసెంబర్‌లో కన్నుమూశాక ఆమె పార్టీ తరఫున ఇద్దరు సీఎం పదవిలో కొనసాగారు. మొదట అధికారం చేపట్టిన మాజీ సీఎం శ్రీ ఓ పన్నీర్‌సెల్వం 72 రోజుల పాలన, తర్వాత ముఖ్యమంత్రి అయిన శ్రీ ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌) నాలుగేళ్ల 79 రోజుల ఏలుబడిలో జనం తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఫలితంగా, ఐదేళ్ల క్రితం 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఒక్కటే స్వయంగా మెజారిటీ (133 సీట్లు) సంపాదించింది. కూటమిలోని ఇతర పార్టీలతో కలిపి 159 స్థానాలు దక్కాయి. మొత్తం 234 సీట్లున్న తమిళ అసెంబ్లీలో సాధారణ మెజారిటీకి 118 సీట్లు అవసరం. ఈ ఎన్నికల్లో డీఎంకే కూటమిలోని కాంగ్రెస్‌ 18, వీసీకే 4, సీపీఐ 2, సీపీఎం 2, ముస్లిం లీగ్‌ ఒక స్థానం గెలుచుకున్నాయి. అయితే, కిందటిసారి 25 సీట్లకు పోటీచేసిన కాంగ్రెస్‌ డీఎంకేపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకురావడంతో ఈసారి 28 స్థానాలను హస్తం పార్టీకి సీఎం శ్రీ స్టాలిన్‌ కేటాయించారు. కూటమి మళ్లీ మెజారిటీ సాధిస్తే కాంగ్రెస్‌కు మంత్రి పదవులు ఇవ్వాలన్న డిమాండ్‌ను డీఎంకే తిరస్కరించింది. మొన్నటి రాజ్యసభ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్‌కు మొదటిసారి ఒక రాజ్యసభ సీటు ఇచ్చి డీఎంకే దాన్ని బుజ్జగించింది.
*డీఎంకే 164 సీట్లకు పోటీ
కూటమికి నాయకత్వం వహిస్తున్న డీఎంకే 164, కాంగ్రెస్‌ 28, దివంగత తమిళ హీరో శ్రీ విజయ్‌కాంత్‌ స్థాపించిన డీఎండీకే 10, వీసీకే 8, సీపీఐ 5, సీపీఎం 5, వైగో నాయత్వంలోని ఎండీఎంకే 4, ముస్లింలీగ్‌ 2, కొంగునాడు దేశీయ మక్కల్‌ కచ్చి 2, ఎంఎంకే 2 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఇంకా ఈ కూటమిలోని 4 అతి చిన్న పార్టీలు ఒక్కోస్థానంలో అభ్యర్ధులను బరిలోకి దింపాయి. ఈ కూటమికి లౌకిక, ప్రగతిశీల కూటమి (ఎస్పీఏ) అని పేరు పెట్టారు. వరుసగా రెండోసారి తప్పనిసరిగా గెలవాలనే పట్టుదలతో డీఎండీకేతోపాటు అనేక చిన్నాచితకా పార్టీలకు తన కూటమిలో శ్రీ స్టాలిన్‌ స్థానం కల్పించారు. సినీ హీరో, రాజ్యసభ ఎంపీ శ్రీ కమల్‌హాసన్‌ నాయకత్వంలోని మక్కల్‌ నీతి మయ్యం(ఎంఎన్‌ఎం)కు మాత్రం ఒక్క సీటూ కేటాయించలేదు. అయినా, ఈ పార్టీ పాలక కూటమిలో కొనసాగుతోంది. ఇక ఏఐడీఎంకే నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి విషయానికి వస్తే–దీనికి నాయకత్వం వహిస్తున్న ఏఐఏడీఎంకే 178 సీట్లలో అభ్యర్ధులను నిలిపింది. ఇతర భాగస్వామ్య పార్టీలైన బీజేపీ 27, డా.అన్బుమణి రాందాస్‌ నేతృత్వంలోని పీఎంకే చీలికవర్గం 18, జయలలిత స్నేహితురాలు శశికళా నటరాజన్‌ సమీప బంధువు శ్రీ టీటీవీ దినకరన్‌ నాయకత్వంలోని అమ్మా మక్కల్‌ మున్నేట్ర కచ్చి (ఏఎంఎంకే) 11 సీట్లకు పోటీ చేస్తున్నాయి. మిగిలిన సీట్లను చిన్న భాగస్వామ్యపక్షాలకు కేటాయించారు.
* ‘తళపతి’ శ్రీ విజయ్‌ పార్టీ టీవీకే రాకతో కొంత సస్పెన్స్‌
తమిళ హీరో ‘తళపతి’ శ్రీ విజయ్‌ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) ఈ ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగడం ఊహించని పరిణామం. కొన్ని దశాబ్దాలుగా డీఎంకే, ఏఐఏడీఎంకే కూటముల మధ్యే ఎన్నికల పోరు పరిమితమైన తమిళనాడులో టీవీకే రంగ ప్రవేశంతో తుది ఫలితాలపై దాని ప్రభావం ఎంత? అనే ప్రశ్న చర్చనీయాంశమైంది. టీవీకే చీల్చే ఓట్లు ఏ కూటమికి నష్టం కలిగిస్తాయి? ఏ కూటమికి మేలు చేస్తాయనే విషయంపై ఎన్నికల పండితులు విశ్లేషిస్తున్నారు. ఎన్నికల ముందు జరిపిన అనేక సర్వేల్లో టీవీకేకు 6–12 నుంచి 70 సీట్ల వరకూ దక్కవచ్చని అంచనాలు వేశారు. అయితే, యవతరంలో పెద్ద సంఖ్యలో అభిమానులున్న శ్రీ విజయ్‌ పార్టీకి గరిష్ఠంగా 22–25 సీట్ల వరకు రావచ్చని కొందరు విశ్లేషకుల అంచనా. ఈ కొత్త పార్టీకి పడే ఓట్లు 13.6% నుంచి 19.2% మధ్య ఉండొచ్చని వివిధ సర్వేలు సూచిస్తున్నాయి. హీరో శ్రీ విజయ్‌ కొత్త తరం ఓటర్లపైనే (జన్‌ జీ) ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. ఉత్తర చెన్నై పరిధిలోని పెరంబూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్న టీవీకే నేత తాను నామినేషన్‌ వేసిన రోజునే తనను ఎమ్మెల్యేగా గెలిపించి పంపించేది నవతరం ఓటర్లేనని నొక్కి వక్కాళించారు. ‘‘ కొత్త తరమా, విజిల్‌ గుర్తుకే ఓటేయండి. నాకో అవకాశం ఇవ్వండి. ఈ ఎన్నికలు విజిల్‌ విప్లవం తీసుకొస్తాయి, ’’ అంటూ ‘ఏప్రిల్‌ 23న ఈల ఊది మమ్మల్ని గెలిపించండి,’’ అని అక్కడి ప్రజలను శ్రీ విజయ్‌ కోరారు. అంతేగాక మొత్తం 234 స్థానాల్లో తానే టీవీకే అభ్యర్ధినని ఆయన పూర్తి విశ్వాసంతో ప్రకటించారు. రెండు మూడు నియోజకవర్గాల్లో టీవీకే అభ్యర్ధుల నామినేషన్లు సాంకేతిక కారణాల వల్ల చెల్లకపోయినా ‘తళపతి’లో ఉత్సాహం తగ్గలేదు. ఎన్నికల తేదీలు ప్రకటించడానికి ముందు కాంగ్రెస్, బీజేపీ సహా అనేక రాజకీయపక్షాలు టీవీకేతో ఎన్నికల పొత్తుకు ప్రయత్నించాయి. అయితే, శ్రీ విజయ్‌ ఆసక్తి ప్రదర్శించకపోవడంతో ఆ ప్రయత్నాలు ముందుకు సాగలేదు. కాంగ్రెస్‌ వంటి పార్టీలు డీఎంకే నుంచి ఎక్కువ సీట్లు బేరమాడడానికి టీవీకేతో పొత్తు అస్త్రాన్ని ప్రయోగించాయి. రాష్ట్రంలోని మొత్తం 5.6 కోట్ల మంది ఓటర్లలో 40 సంవత్సరాల లోపు వయసున్న పౌరులపై శ్రీ విజయ్‌ దృష్టి కేంద్రీకరించారు. వారి శాతం 40% వరకూ ఉండొచ్చని అంచనా. ఇప్పటి వరకూ కులం, మతం అనే గుర్తింపు ద్వారా సాగిన ఎన్నికల ధోరణి నుంచి బయటపడి యువత తమకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయనే అంచనాతో టీవీకేకు ఓటేస్తారా? అనేది శ్రీ విజయ్‌ రాజకీయ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. టీవీకే తరఫున 51 ఏళ్ల శ్రీ విజయ్‌ యువతరాన్ని ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా, పాలకపక్షం డీఎంకే తరఫున సీఎం కుమారుడు, ఉప ముఖ్యమంత్రి అయిన 48 సంవత్సరాల శ్రీ ఉదయనిధి స్టాలిన్‌ నవతరం ఓటర్లను ఆకట్టుకోవడానికి కృషి చేస్తున్నారు. అలాగే, బీజేపీ తరఫున 41 ఏళ్ల నాయకుడు శ్రీ కే అన్నామలై యువజనాన్ని ఎన్డీఏ వైపు మళ్లించడానికి తన ప్రసంగాల ద్వారా అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. ఏదేమైనా టీవీకే సాధించే ఓట్లు, సీట్లు తుది ఫలితాలను ప్రభావితం చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

*2021 ఎన్నికల్లో ఏఐఏడీఎంకే–బీజేపీ కూటమికి 75 సీట్లు
కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో పాలక డీఎంకే నాయకత్వంలోని కూటమి (ఎస్పీఏ) మొత్తం 159 స్థానాలు గెల్చుకోగా, ఏఐఏడీఎంకే, బీజేపీ, పీఎంకే కూటమి (ఎన్డీఏ) 75 సీట్లు దక్కించుకుంది. ఏఐఏడీఎంకేకు 66, బీజేపీ 4, పీఎంకే 5 స్థానాలు మాత్రమే గెలుచుకున్నాయి. మొత్తం పోలైన ఓట్లలో డీఎంకే కూటమికి 45.38 శాతం ఓట్లు దక్కగా, ఏఐఏడీఎంకే కూటమికి 39.7 శాతం ఓట్లు లభించాయి. బీజేపీ 20 స్థానాలకు పోటీచేసి 2.6% ఓట్లతో నాలుగు సీట్లు గెల్చుకుంది. 
*ఎన్నికల బరిలో ప్రధాన నేతలు
సీఎం శ్రీ స్టాలిన్‌ చెన్నైలోని తన పాత స్థానం కొలత్తూర్‌ నుంచి వరుసగా నాలుగోసారి పోటీచేస్తున్నారు. 2011 నుంచి శ్రీ స్టాలిన్‌ పోటీచేస్తున్న ఈస్థానం నుంచి ఏఐఏడీఎంకే తరఫున శ్రీ సంతానకృష్ణన్, టీవీకే టికెట్‌పై శ్రీ వీఎస్‌ బాబు బరిలోకి దిగారు. తెలంగాణ గవర్నర్‌గా పనిచేసిన శ్రీమతి తమిళసై సౌందరరాజన్‌ ఈసారి బీజేపీ టికెట్‌పై చెన్నై నగరంలోని టీ నగర్‌ స్థానం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. కన్యాకుమారి ప్రాంతానికి చెందిన ఆమె తమిళ సాంప్రదాయ సాంస్కృతిక రాజధానిగా పరిగణించే టీ నగర్‌ నుంచి బరిలోకి దిగడం విశేషం. తమిళ, తెలుగు సినిమా రంగాలతో ఈ ప్రాంతానికి విడదీయరాని బంధం ఉంది. శ్రీమతి తమిళసైతో డీఎంకే, టీవీకే, ఎన్టీకే అభ్యర్ధులు తలపడుతున్నారు. కిందటి ఎన్నికల్లో డీఎంకే అభ్యర్ధి శ్రీ ధా వేలు ఇక్కడ విజయం సాధించారు. మాజీ సీఎం, ఏఐఏడీఎంకే నేత శ్రీ ఎడప్పాడి కే పళనిస్వామి సేలం జిల్లాలోని తన పాత కంచుకోట మెట్టూర్‌ నుంచి పోటీచేస్తున్నారు. కావేరీ డెల్టాలో సారవంతమైన మెట్టూర్‌ స్థానంలో శ్రీ పళనిస్వామి గెలుపు ఖాయమని అంచనా వేస్తున్నారు. కిందటి ఎన్నికల్లో ఆయన 26 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ స్థానంలో ఏఐఏడీఎంకే ఏడుసార్లు విజయం సాధించగా శ్రీ పళనిస్వామి ఐదుసార్లు గెలిచారు. డీఎంకే అభ్యర్ధిగా శ్రీ సి.కాశీ అనే వస్త్ర వ్యాపారి మాజీ సీఎంతో తలపడుతున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు శ్రీ నయనార్‌ నాగేంద్రన్‌ తిరునెల్వేలీ స్థానం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. 2021 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి బీజేపీ టికెట్‌పై ఆయన గెలిచారు. 2001, 2011 ఎన్నికల్లో ఆయన ఏఐఏడీఎంకే తరఫున ఎన్నికయ్యారు. తమిళ అసెంబ్లీలో వయసులో అందరి కన్నా పెద్దవాడైన వివాదాస్పద డీఎంకే మంత్రి శ్రీ దురై మురుగన్‌ (87) వేలూర్‌ జిల్లా కాట్పాడి నుంచి మరోసారి పోటీ చేస్తున్నారు. 1989లో నాటి ప్రతిక్ష నాయకురాలు జయలలితను అసెంబ్లీలో అవమానించారనే ఆరోపణ కారణంగా శ్రీ మురుగన్‌ అప్పట్లో వార్తల్లోకి ఎక్కారు. ఆయన శ్రీ కరుణానిధి, శ్రీ స్టాలిన్‌ కేబినెట్లలో సభ్యుడు. ఆయనపై ప్రధాన పార్టీలు అభ్యర్ధులను నిలిపాయి. తమిళనాడు కాంగ్రెస్‌ అధ్యక్షుడు శ్రీ కె.సెల్వపెరుంతగై ఈ ఎన్నికల్లో శ్రీపెరంబుదూర్‌ (ఎస్సీ) స్థానం నుంచి పోటీలో ఉన్నారు.
*తమిళ పార్టీల ఎన్నికల హామీలు
తమిళనాడులో ప్రాంతీయ ద్రవిడ పార్టీలు ఎన్నికల ప్రణాళికల్లో ఓటర్లను ఆకట్టుకోవడానికి జనాకర్షక పథకాలకు తెరతీయడం ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. 2006 అసెంబ్లీ ఎన్నికల్లో నాటి ప్రతిపక్షమైన డీఎంకే ఓటర్లకు కిలో బియ్యం రూ.2 ధరకు ఇస్తామని హామీ ఇచ్చింది. అంతేగాక, తాము అధికారంలోకి వస్తే ఉచితంగా కలర్‌ టీవీ సెట్లు, గ్యాస్‌ స్టవ్‌లు పంపిణీ చేస్తామని తన ఎన్నికల ప్రణాళికలో ప్రకటించింది. తొలిసారి ఇలాంటి జనాకర్షక హామీల ఫలితంగా అప్పుడు డీఎంకే తిరుగులేని విజయం సాధించింది. 2026 శాసనసభ ఎన్నికల విషయానికి వస్తే పాలకపక్షమైన డీఎంకే మహిళలకు (ఆదాయపన్ను చెల్లించని ఓటర్లు) తమకు ఇష్టమైన ఎలక్ట్రానిక్‌ వస్తువులను తమ ఇళ్లకు సమీపంలోని షాపుల్లో కొనుగోలుకు రూ.8000 విలువైన కూపన్లు ఇస్తామని హామీ ఇచ్చింది. ఇంకా అనేక సంక్షేమ పథకాలు ప్రకటించింది. అంతేగాక, సమాఖ్య స్ఫూర్తితో రాష్ట్రాలకు మరిన్ని నిధులు, అధికారాలు వచ్చేలా పోరాడతామని ఎన్నికల ప్రణాళికలో డీఎంకే వాగ్దానం చేసింది. ప్రస్తుత ప్రతిపక్షమైన ఏఐఏడీఎంకే కూడా స్త్రీలకు ఎన్నో వాగ్దానాలు చేసింది. ఉచితంగా రిఫ్రిజిరేటర్లు, ఎల్పీజీ సిలిండర్లు, నెలకు రూ.2000 ఉచిత సాయం చేస్తామని హామీ ఇచ్చింది. చెన్నైపై ఒత్తిడి తగ్గించి, ప్రజలకు పాలన అందుబాటులోకి రావడానికి అనేక కార్యనిర్వాహక రాజధానులు ఏర్పాటు చేస్తామని తమిళ జాతీయవాద పార్టీ ఎన్టీకే హామీ ఇస్తోంది. ఈ పార్టీ నేత, నటుడు శ్రీ సీమన్‌ను తీవ్ర తమిళ జాతీయవాద భావాలున్న నేతగా పరిగణిస్తారు. కిందటి ఎన్నికల్లో ఆయన పార్టీకి నాలుగు శాతానికి పైగా ఓట్లు వచ్చాయి.
ఎన్డీఏలో ప్రధాన భాగస్వామ్యపక్షమైన బీజేపీ డా.బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి రోజు తన ఎన్నికల ప్రణాళిక విడుదల చేసింది. ఎన్నికల ప్రణాళికను బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి శ్రీ జేపీ నడ్డా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఇంకా బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు శ్రీ నయనార్‌ నాగేంద్రన్, మాజీ అధ్యక్షుడు శ్రీ కే అన్నామలై, శ్రీమతి తమిళ సై సౌందరరాజన్‌ పాల్గొన్నారు. మహిళలకు ఉచితంగా ఎల్పీజీ సిలిండర్లు, రూ.2000 నెలవారీ సహాయం అందిస్తామని బీజేపీ తమిళ ఓటర్లకు వాగ్దానం చేసింది. ఈ సందర్భంగా డీఎంకే కుటుంబ పాలనపై శ్రీ నడ్డా విమర్శనాస్త్రాలు సంధించారు. ‘‘డీఎంకే కుటుంబ పార్టీ. స్టాలిన్‌ నేతృత్వంలో సాగే ఈ పాలకపక్షంలో రాజకీయ వారసుడు ఉదయనిధి. కనిమొళి భాగస్వామి. శబరీశన్‌ మేనేజర్‌. డీఎంకే ఇలా నడుస్తోంది,’’ అని శ్రీ నడ్డా విమర్శించారు. మొత్తం మీద అన్ని పార్టీలూ, కూటములూ తమిళ ఓటర్లను ఆకట్టుకోవడానికి తమ ఎన్నికల ప్రణాళికల్లో ఆకర్షణీయమైన హామీలు ఇస్తున్నాయి. అయితే, ప్రతిపక్షాల వాగ్దానాలను జనం నమ్మి ఓట్లేస్తారో, డీఎంకే ఐదేళ్ల పాలన చూసి దాన్ని మరోసారి గెలిపిస్తారో మే 4న తేలిపోతుంది.
*వోట్‌–వైబ్‌ సర్వేలో ఎన్డీఏ కూటమిదే విజయం
శ్రీ పళనిస్వామి నాయకత్వంలోని ఏఐఏడీఎంకే–బీజేపీ కూటమి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 41 శాతం ఓట్లతో ముందంజలో ఉందని ఈ నెల ఆరున విడుదల చేసిన సీఎన్‌ఎన్‌–న్యూస్‌ 18 ఓట్‌ ట్రాకర్‌ ఎన్నికల సర్వే అంచనా వేసింది. ఈ సర్వే ప్రకారం చూస్తే సీఎం శ్రీ స్టాలిన్‌ నాయకత్వంలోని డీఎంకే కూటమి 39 శాతం ఓటర్ల మద్దతుతో రెండో స్థానంలో ఉంది. ఈ లెక్కన ఏఐఏడీఎంకే కూటమి 130 నుంచి 140 సీట్లు గెల్చుకోవచ్చని, డీఎంకే 90 నుంచి 100 సీట్లకు పరిమితం కావచ్చని ఈ సర్వే ఫలితాలు సూచిస్తున్నాయి. ఈ సర్వేను ప్రముఖ సర్వే సంస్థ వోట్‌ వైబ్‌ నిర్వహించింది. అయితే, డీఎంకే కూటమి 40.1% ఓట్లతో 181 నుంచి 189 సీట్లు గెలిచే అవకాశాలున్నాయని, ఏఐడీఎంకే కేవలం 38–42 సీట్లు, టీవీకే 8 నుంచి పది సీట్లు మాత్రమే దక్కించుకునే సూచనలు ఉన్నాయని లోక్‌ పోల్‌ అనే సర్వే సంస్థ పరిశీలనలో తేలింది. అలాగే, మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకునే ఓటర్లు, కొత్త తరం ఓటర్లలో ఉన్న ఆదరణ కారణంగా టీవీకే నేత శ్రీ విజయ్‌ ముఖ్యమంత్రి పదవికి తగిన అభ్యర్ధి అని 14% నుంచి 27% ఓటర్లు వివిధ సర్వేల్లో అభిప్రాయపడ్డారు. యువత ఓట్లను చీల్చుకోవడం ద్వారా టీవీకే చివరికి పరోక్షంగా డీఎంకేకు ఈ ఎన్నికల్లో మేలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని కొన్ని సర్వే ఫలితాలు జోస్యం చెబుతున్నాయి. సీఎం శ్రీ స్టాలిన్‌ తండ్రి శ్రీ కరుణానిధి 94 ఏళ్లు జీవించారు. 33 సంవత్సరాల వయసులో శాసనసభకు ఎన్నికయి, తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో దాదాపు 19 ఏళ్లు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగారు. మరి ఆయన కుమారుడు శ్రీ స్టాలిన్‌కు తండ్రి బాటలో పయనించే అవకాశం వచ్చేదీ లేనిదీ వచ్చే నెల ఆరంభంలో తేలిపోతుంది.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.