పిల్లల భద్రతే లక్ష్యం… మైనర్ డ్రైవింగ్‌ను కట్టడి చేయాలి: ఎస్పీ హర్షవర్ధన్

  1. మైనర్లకు వాహనాలు ఇచ్చినట్లయితే యజమానులు, తల్లిదండ్రులపై చర్యలు
  2. పిల్లల భద్రతే లక్ష్యం… మైనర్ డ్రైవింగ్‌ను కట్టడి చేయాలి: జిల్లా ఎస్పీ
  3. రహదారి నిబంధనలు పాటించండి… మీ ప్రాణాలు, మీ కుటుంబ సంతోషం మీ చేతుల్లోనే

ప్రకాశం: వేసవి సెలవుల నేపథ్యంలో మైనర్ డ్రైవింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ తెలిపారు. పిల్లల భద్రతే ప్రధాన లక్ష్యమని, మైనర్ డ్రైవింగ్‌ను పూర్తిగా కట్టడి చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరమని, అలా చేసిన వాహన యజమానులు మరియు తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, భారీ జరిమానాలు మరియు అవసరమైతే జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉందని స్పష్టం చేశారు.

వేసవి సెలవుల్లో మైనర్లు సరదాగా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు. ట్రాఫిక్ నియమాలపై పూర్తి అవగాహన లేకుండా వాహనాలు నడపడం ప్రాణాంతకమవుతుందని తెలిపారు.

తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వారు ఎక్కడికి వెళ్తున్నారు, ఏమి చేస్తున్నారు అనే విషయాలను పర్యవేక్షించాలని సూచించారు. హెల్మెట్ వినియోగం, ట్రాఫిక్ నియమాలపై చిన్న వయసులోనే అవగాహన కల్పించాలని తెలిపారు.

వాహనదారులు రహదారి నియమాలు పాటిస్తూ, అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్, రాంగ్ రూట్ ప్రయాణాలు చేయకూడదని సూచించారు. వాహన ప్రయాణానికి ముందు టైర్లు, బ్రేకులు వంటి భద్రతా అంశాలను తనిఖీ చేసుకోవాలని చెప్పారు.

పిల్లల భవిష్యత్తు, ప్రాణభద్రత దృష్టిలో ఉంచుకుని మైనర్ డ్రైవింగ్‌ను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.