
బెంగళూరు: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన అధ్యక్షుడు కొణిదల పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకుని మళ్లీ ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తూ పుంగనూరు నియోజకవర్గ జనసేన నాయకుడు కోలా సోమశేఖర్ ప్రత్యేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని విభిన్న ప్రతిభావంతుల ఆశ్రమంలో తన కుటుంబ సమేతంగా పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకుముందు పవన్ కళ్యాణ్ పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేశారు.
ఈ సందర్భంగా కోలా సోమశేఖర్ మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం కోసం నిరంతరం శ్రమించే నాయకుడు పవన్ కళ్యాణ్ అని, రాష్ట్ర అభివృద్ధిలో ఆయన పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఆయన త్వరగా పూర్తిస్థాయిలో కోలుకుని మళ్లీ ప్రజాసేవలో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న శాఖలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని ఆయన కొనియాడారు. కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా వినూత్న పాలనతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని సోమశేఖర్ గారు ఈ సందర్భంగా గుర్తు చేశారు.