మాజీ ముఖ్యమంత్రి శ్రీ నాదెండ్ల భాస్కరరావుకి తుది వీడ్కోలు

* అధికారిక లాంఛనాలతో కార్యక్రమం నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వం
* ఘనంగా నివాళులర్పించిన ప్రముఖులు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నాదెండ్ల భాస్కరరావు గారికి కడసారి నివాళులర్పించేందుకు ప్రముఖులు తరలివచ్చారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని నివాసంలో శ్రీ భాస్కరరావు గారి పార్థివ దేహాన్ని సందర్శించి పుష్పాంజలి ఘటించారు. సన్నిహితులు, కుటుంబ సభ్యులు, బంధువులను పలకరిస్తూ వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కష్టకాలంలో భగవంతుడు కొండంత ధైర్యం ఇవ్వాలని ఓదార్చారు. శ్రీ భాస్కర రావు గారి కుమారుడు ఏపీ పౌరసరఫరాలు, ఆహార వినియోగదారుల వ్యవహారాల మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీలకు అతీతంగా శ్రీ భాస్కర రావు గారికి తుది వీడ్కోలు పలికేందుకు రెండు తెలుగు రాష్ర్టాల ప్రముఖులు హాజరయ్యారు.
అన్ని రంగాల ప్రముఖులు రాక
శ్రీ నాదెండ్ల భాస్కర్ రావు గారి మృతి వార్త తెలుసుకొని బుధవారం సాయంత్రం నుంచి ఆయన పార్థివదేహాన్ని సందర్శించేందుకు ప్రముఖులు తరలివస్తూనే ఉన్నారు. గురువారం ఉదయం అగ్ర కథానాయకులు శ్రీ చిరంజీవి గారు శ్రీ భాస్కరరావు గారికి పుష్పాంజలి ఘటించారు. శ్రీ మనోహర్ గారిని పలకరించి ధైర్యం చెప్పారు. సినీ పరిశ్రమ నుంచి శ్రీ అల్లు అరవింద్, శ్రీ బన్నీ వాసు, పీపుల్స్ మీడియా అధినేత శ్రీ విశ్వప్రసాద్, శ్రీ ఘట్టమనేని ఆది శేషగిరిరావు ఉన్నారు. రాజకీయ రంగం నుంచి కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి, తెలంగాణ డిప్యూటీ సీఎం శ్రీ మల్లు భట్టి విక్రమార్క, ఏపీ డిప్యూటీ స్పీకర్ శ్రీ రఘురామ కృష్ణంరాజు, తెలంగాణ రాష్ట్ర మంత్రులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీ వివేక్, శ్రీ శ్రీధర్ బాబు, శ్రీ దామోదర రాజనర్సింహ, ఏపీ మంత్రులు శ్రీ కందుల దుర్గేష్, శ్రీ కొలుసు పార్థసారధి, శ్రీమతి సవిత, శ్రీ కొండపల్లి శ్రీనివాస్, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ మాధవ్, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు శ్రీ రామచంద్ర రావు, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్, రాజ్యసభ మాజీ సభ్యుడు శ్రీ కె.కేశవ రావు, శ్రీ టి.సుబ్బరామి రెడ్డి, శ్రీ కేవీపీ రామచంద్రరావు, ఏపీ ఎమ్మెల్యేలు శ్రీ బుద్ధ ప్రసాద్, శ్రీ సుజనా చౌదరి, శ్రీ పత్సమట్ల ధర్మరాజు, శ్రీ పంతం నానాజీ, శ్రీ అరవ శ్రీధర్, శ్రీ పత్తిపాటి పుల్లారావు, శ్రీ బొమ్మిడి నాయకర్, శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్, శ్రీ చింతమనేని ప్రభాకర్, శ్రీ హరిప్రసాద్ ఎం ఎల్ సి, లోక్ సత్తా వ్యవస్థాపకులు శ్రీ జయప్రకాష్ నారాయణ్ గారు, మాజీ మంత్రి శ్రీ రఘువీరారెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్లోని వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు
శ్రీ నాదెండ్ల భాస్కరరావు గారికి తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో ప్రత్యేక ప్లాటున్ బృందం ఆయన నివాసానికి చేరుకుని గౌరవం వందనం అందించారు. అక్కడి నుంచి అంతిమయాత్ర పంజాగుట్ట హిందూ శ్మశాన వాటికకు చేరుకుంది. శ్రీ నాదెండ్ల భాస్కరరావు గారి పెద్ద కుమారుడు శ్రీ నాదెండ్ల మురళి గారు సంప్రదాయబద్ధంగా అంతిమ క్రతువులు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున పోలీసులు మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు. చివరి మజిలిలో కుటుంబ సభ్యులు, అభిమానులు ఆయనకు తుది కన్నీటి వీడ్కోలు పలికారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.