
ప్రపంచ చమురు, గ్యాస్ ధరల పెరుగుదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న దేశాలకు ఇరాన్ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరిచినట్లు విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీ అధికారికంగా ప్రకటించారు.
లెబనాన్‌లో అమల్లో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్నంత వరకు అన్ని వాణిజ్య నౌకల రాకపోకలకు అనుమతి ఉంటుందని ఇరాన్ స్పష్టం చేసింది. ఇటీవల ప్రాంతీయ ఉద్రిక్తతల కారణంగా ఈ మార్గంపై ఏర్పడిన అనిశ్చితి ఈ నిర్ణయంతో తగ్గనుంది.
అయితే ఈ అనుమతులకు కొన్ని షరతులు విధించారు. నౌకలు ఇరాన్ మారిటైమ్ సంస్థ సూచించిన మార్గాల్లోనే ప్రయాణించాల్సి ఉంటుంది. లెబనాన్‌లో శాంతి నెలకొల్పడాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ తెలిపింది. ఒకవేళ కాల్పుల విరమణకు భంగం కలిగితే, ఈ అనుమతులు తిరిగి పరిమితమయ్యే అవకాశముంది.
ప్రపంచ చమురు సరఫరాలో హార్ముజ్ జలసంధి అత్యంత వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన మార్గం. మధ్యప్రాచ్య దేశాల నుంచి ఎగుమతి అయ్యే చమురులో పెద్ద భాగం ఈ మార్గం గుండా వెళుతుంది. తాజా నిర్ణయంతో సరఫరా మెరుగుపడి, అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు తగ్గే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఎల్పీజీ మరియు ఇంధన కొరతతో ఇబ్బంది పడుతున్న దేశాలకు ఈ పరిణామం గణనీయమైన ఉపశమనం కలిగించనుంది.