
విశాఖపట్నం: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో నిర్వహించిన సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందించే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా సైకిల్ తొక్కారు.
ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్‌లో ప్రారంభమైన ఈ యాత్ర త్రీ టౌన్ పోలీస్ స్టేషన్, పోలమాంబ ఆలయం, వాల్తేరు, బీచ్ రోడ్ మీదుగా నోవాటెల్ హోటల్ వరకు సాగింది. మొత్తం 5.5 కిలోమీటర్ల దూరాన్ని ఆయన సుమారు 21 నిమిషాల్లో పూర్తి చేశారు.
ర్యాలీ సందర్భంగా ఎండ తీవ్రంగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఏమాత్రం వెనుకడుగు వేయకుండా సైకిల్ సవారీ కొనసాగించారు. మార్గమధ్యంలో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, యువతతో పాటు స్థానికులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, ఆరోగ్యకర జీవనశైలిపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన ఈ సైకిల్ ర్యాలీ విశాఖ నగరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.