
కూటమి ప్రభుత్వం సినిమాలను రాజకీయం చేయదు
• చిత్ర పరిశ్రమకు రాజకీయ రంగు పులమడం మాకు ఇష్టం లేదు
• చిత్ర పరిశ్రమ మీద ఎన్డీఏ ప్రభుత్వానికి గౌరవం ఉంది
• గత ప్రభుత్వం మాదిరి టిక్కెట్ల ధరల కోసం హీరోలు రావాలని పిలవం
• టిక్కెట్ల ధర పెంపు వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది
• ముఖ్యమంత్రిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చిత్ర పరిశ్రమ అభివృద్ధికే దోహదపడ్డారు
• తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్డీఏ ప్రభుత్వం అండగా ఉంటుంది ⚫రాంచరణ్ మూలాలను మరచిపోకుండా ఎదిగాడు
• గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు
‘చిత్ర పరిశ్రమకు రాజకీయ రంగు పులమడం మాకు ఇష్టం లేదు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమకు అండగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చిత్ర పరిశ్రమ మీద గౌరవం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చిత్ర పరిశ్రమ అభివృద్ధికి దోహదపడుతుంది తప్ప ఎవ్వరినీ ఇబ్బందపెట్టబోద’ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. టిక్కెట్ల ధరలు పెంచేందుకు గత ప్రభుత్వం మాదిరి హీరోలని పిలవబోమని అన్నారు. టిక్కెట్ల ధరలు పెంచడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా టాక్స్ రూపంలో ఆదాయం వస్తుందని, కొంత మంది ధరల పెంపుని వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని తెలిపారు. చిత్ర పరిశ్రమ గురించి సినిమాలు తీసేవారు మాత్రమే మాట్లాడాలని సూచించారు. శనివారం సాయంత్రం రాజమండ్రిలో గ్లోబల్ స్టార్ శ్రీ రాంచరణ్ గారు నటించిన గేమ్ ఛేంజర్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. శ్రీ దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి శ్రీ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “సినిమాలు తీయకుండా రాజకీయాలు చేసే వారు నాకు నచ్చరు. తెలుగు చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడాలి అంటే సినిమాలు తీసి దాని సాదకబాధకాలు తెలిసిన వారే మాట్లాడాలి. ఎన్డీఏ ప్రభుత్వం తరఫున చెబుతున్నాను. టీడీపీ, జనసేన, బీజేపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వారితోనే మాట్లాడుతుంది. వారినే గుర్తిస్తుంది. సినిమా టిక్కెట్ల ధరలు పెంచేందుకు హీరోలతో పని ఏంటి? హీరోలు ఎందుకు రావాలి? అలా హీరోలని రప్పించుకోవడం మాకు ఇష్టం లేదు. నిర్మాతలు, ట్రేడ్ బాడీ యూనియన్ వచ్చినా టిక్కెట్ల ధరలు పెంపు ఇస్తాం. గత ప్రభుత్వంలో మాదిరి హీరోలు వచ్చి మాకు నమస్కారాలు పెట్టాలని ఆలోచించే లో లెవల్ వ్యక్తులం కాదు.


