
అమరావతి, ఆగస్టు 20: తూర్పు కాపు సామాజిక వర్గాన్ని కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని తూర్పు కాపు సంఘం ప్రతినిధులు కోరారు. ఈ అంశంపై అమరావతిలో జరిగిన సమావేశానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, తూర్పు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు పాలవలస యశస్వి, ఆర్టీసీ జోన్-2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, సంఘం ప్రతినిధులు, బీసీ సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.
తూర్పు కాపులకు కేంద్ర ఓబీసీ హోదా కల్పించాలనే డిమాండ్ న్యాయబద్ధమైనదని, ఇది సామాజిక న్యాయానికి సంబంధించిన అంశమని ప్రతినిధులు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని ప్రాధాన్యంగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు.
ఈ డిమాండ్‌ను ఇప్పటికే మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించినట్లు సమావేశంలో ప్రతినిధులు వెల్లడించారు. అవసరమైతే ఢిల్లీకి వచ్చి సంబంధిత కేంద్ర మంత్రులు, జాతీయ బీసీ కమిషన్ ప్రతినిధులతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు నారా లోకేష్ హామీ ఇచ్చారని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని సానుకూలంగా ముందుకు తీసుకెళ్తుందనే విశ్వాసాన్ని వారు వ్యక్తం చేశారు.
కేంద్ర ఓబీసీ జాబితాలో తూర్పు కాపులను చేర్చే ప్రక్రియలో భాగంగా అవసరమైన సామాజిక, ఆర్థిక వివరాలు, గణాంకాలు, సంబంధిత నివేదికలు, ప్రభుత్వ సిఫారసులను పటిష్టంగా సిద్ధం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. పూర్తిస్థాయి సమాచారాన్ని సమీకరించి, ప్రక్రియను వేగవంతం చేసి జాతీయ బీసీ కమిషన్‌కు సమర్పించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఓబీసీ హోదాపై తుది నిర్ణయం వెలువడే వరకు విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన అవసరాన్ని కూడా సమావేశంలో ప్రస్తావించారు. అర్హత ఉన్న తూర్పు కాపు కుటుంబాలకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు అందేలా జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. విద్య, ఉద్యోగ అవకాశాల విషయంలో అనవసర ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
అలాగే సర్టిఫికెట్లు, మైగ్రేషన్ పత్రాలు, ఇతర అవసరమైన ధ్రువపత్రాల జారీ విషయంలో తూర్పు కాపు కుటుంబాలు ఎదుర్కొనే సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను కోరారు. ప్రజలకు అవసరమైన ధ్రువపత్రాలు సకాలంలో అందేలా జిల్లా స్థాయిలో సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
అయితే ఈడబ్ల్యూఎస్ సౌకర్యం తాత్కాలిక ఉపశమనమే తప్ప, తూర్పు కాపులకు కేంద్ర ఓబీసీ హోదా సాధించడమే ప్రధాన లక్ష్యమని సమావేశంలో స్పష్టం చేశారు. ఇందుకోసం అవసరమైన ఆధారాలు, గణాంకాలు, నివేదికలను సమగ్రంగా సిద్ధం చేసి కేంద్ర స్థాయిలో బలమైన ప్రతిపాదనను సమర్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలోని బీసీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, తూర్పు కాపు సంఘం నాయకులు, బీసీ సంక్షేమ శాఖ అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు. తూర్పు కాపులను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం, జాతీయ బీసీ కమిషన్ దృష్టికి బలంగా తీసుకెళ్లి తదుపరి చర్యలను వేగంగా చేపట్టాలని నిర్ణయించారు.
సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులు, యువత, కుటుంబాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రతినిధులు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, సంఘం నాయకులు సమన్వయంతో ముందుకు సాగితే తూర్పు కాపులకు కేంద్ర ఓబీసీ హోదా సాధించే దిశగా గణనీయమైన పురోగతి సాధ్యమవుతుందని సమావేశంలో ఆశాభావం వ్యక్తమైంది.
సమావేశంలో ఓబీసీ సాధన కమిటీ చైర్మన్ సరిపిడకల రామారావు, ఏలూరు తూర్పు కాపు అధ్యక్షుడు బౌరోతు బాలాజీ, జిల్లా కార్యదర్శి పిన్నింటి మహేష్, పరిరక్షణ కమిటీ వైస్ చైర్మన్ మజ్జి కాంతారావు, తూర్పు కాపు పట్టణ యువత అధ్యక్షుడు సరిది రాజేష్, తూర్పు కాపు పట్టణ కోశాధికారి యాగాటి లక్ష్మీనారాయణ, గుడిదేశి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.