పిఠాపురం మహారాజు సేవా స్ఫూర్తి చిరస్మరణీయం: తుమ్మల రామస్వామి

పిఠాపురం: దాతృత్వం, సేవా కార్యక్రమాలకు మారుపేరుగా నిలిచిన పిఠాపురం మహారాజు సేవలు చిరస్మరణీయమని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు అన్నారు. పిఠాపురం శ్రీ సంస్థాన సత్రం ఆధ్వర్యంలో, దేవాదాయ శాఖ సహకారంతో పిఠాపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు ఉచిత భోజన సదుపాయ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమాన్ని పిఠాపురం పైన్ కమిటీ సభ్యులు, తుమ్మల రామస్వామి బాబు, ఓదూరి కిషోర్, పిఠాపురం రాజవంశ వారసులు రత్నాసుదారం రాజా తదితరులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ.. పిఠాపురం మహారాజు విద్య, వైద్యం, అన్నదానం, సామాజిక సేవ వంటి రంగాల్లో అందించిన సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. వారి సేవా స్ఫూర్తితో అనేక విద్యా సంస్థల ద్వారా విద్యార్థులకు విద్యావకాశాలు కల్పిస్తూ వారి భవిష్యత్తుకు బాటలు వేస్తున్నామని తెలిపారు.

పిఠాపురం మహారాజు సేవా స్ఫూర్తికి ప్రతిరూపంగా, దాతృత్వానికి మారుపేరుగా జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ నిలుస్తున్నారని అన్నారు. ప్రజా సేవను కేవలం రాజకీయ బాధ్యతగా కాకుండా సామాజిక బాధ్యతగా ఆయన భావిస్తున్నారని పేర్కొన్నారు.

“ఎవరూ ఆకలితో ఉండకూడదు” అనే ఆలోచనతో, డొక్కా సీతమ్మ స్ఫూర్తిని కొనసాగిస్తూ పిఠాపురం నియోజకవర్గంలో అనేక అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పేదలు, విద్యార్థులు, కార్మికులు, సామాన్య ప్రజలకు అండగా నిలిచే సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

పిఠాపురం అభివృద్ధికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని, మౌలిక వసతులు, విద్య, తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, పర్యాటక అభివృద్ధి తదితర రంగాల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా చర్యలు చేపడుతున్నారని తుమ్మల రామస్వామి బాబు తెలిపారు. అభివృద్ధితో పాటు మానవత్వం, సేవాభావం, దాతృత్వం కలిసినప్పుడే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.

పిఠాపురం మహారాజు సేవా వారసత్వాన్ని కొనసాగిస్తూ, పవన్ కళ్యాణ్ సేవా ఆలోచనలను ముందుకు తీసుకెళ్లడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపునిచ్చారు. విద్యార్థులకు ఉచిత భోజన సదుపాయం కల్పిస్తున్న శ్రీ సంస్థాన సత్రం నిర్వాహకులను అభినందించారు.

పిఠాపురం మహారాజు దాతృత్వ స్ఫూర్తి, పవన్ కళ్యాణ్ సేవా ఆలోచన, ప్రజల సహకారం కలిసినప్పుడు నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని, పిఠాపురంలో ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదన్న లక్ష్యంతో ముందుకు సాగాలని తుమ్మల రామస్వామి బాబు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో పిఠాపురం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బుర్ర అనిబాబు, జనసేన పార్టీ టౌన్ ఇంచార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ వాకపల్లి దేవి సూర్యప్రకాష్, ఏపీ స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్లు పెంకే జగదీష్, దానం లాజర్ బాబు, మొగిలి అప్పారావు, కంచర్ల భవాని శంకర్, పిఠాపురం జనసేన నాయకులు రావుల రమణారావు, వడ్డీ రాజశేఖర్, పల్నాటి మధుబాబు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.