మెగా డీఎస్సీ 2025కు మద్దతుగా కాకినాడలో ‘ఆత్మగౌరవ సదస్సు’

కాకినాడ: మెగా డీఎస్సీ 2025 నియామకాలపై వైఎస్సార్‌సీపీ చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ ఉపాధ్యాయులు కాకినాడ డీఎస్‌ఏ గ్రౌండ్స్‌లో బుధవారం ‘ఆత్మగౌరవ సదస్సు’ నిర్వహించారు. కాకినాడ, కోనసీమ, అల్లూరి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు.

సదస్సుకు ముందు డీఎస్‌ఏ ప్రాంగణంలోని ధ్యాన్‌చంద్ విగ్రహానికి ఉపాధ్యాయులు నివాళులర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు ధన్యవాదాలు తెలుపుతూ ప్లకార్డులను ప్రదర్శించారు.

తర్వాత డీఎస్‌ఏ గ్రౌండ్స్ నుంచి నాగమల్లితోట జంక్షన్ వరకు ‘ఆత్మగౌరవ ర్యాలీ’ నిర్వహించారు. డీఎస్సీ 2025 నియామకాలపై కుట్రలు చేయవద్దంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు.

డీఎస్సీ నియామకాల ప్రక్రియకు సంబంధించి విద్యాశాఖ అధికారులు ఎప్పటికప్పుడు వాస్తవాలను వెల్లడిస్తున్నప్పటికీ, రాజకీయ ప్రయోజనాల కోసం వైఎస్సార్‌సీపీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఉపాధ్యాయులు విమర్శించారు. ఇప్పటికే ఎంపికైన అభ్యర్థుల భవిష్యత్తుతో రాజకీయాలు చేయడం సరికాదని స్పష్టం చేశారు.

డీఎస్సీ 2025 నియామకాలపై ఎలాంటి కుట్రలకు పాల్పడే ప్రయత్నాలను సహించబోమని ఉపాధ్యాయులు తెలిపారు. ఎంపికైన అభ్యర్థుల ఆత్మగౌరవాన్ని, వారి భవిష్యత్తును కాపాడేందుకు అవసరమైన విధంగా తమ పోరాటాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వివిధ క్రీడా సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యాయులు, డీఎస్సీ క్రీడా కోటా అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు, అభ్యర్థులు పాల్గొనడంతో కాకినాడలో ఆత్మగౌరవ సదస్సు, ర్యాలీ ఉత్సాహంగా సాగింది.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.