
నిర్మల్: భైంసా మండలంలోని అర్హులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులకు ఆసరా పెన్షన్లు మంజూరు చేయాలని కోరుతూ మండల ప్రజా పరిషత్ అధికారికి దివ్యాంగుల సంక్షేమ సహాయ సంఘం నాయకులు వినతిపత్రం అందించారు.
భైంసా మండలంలో అనేక పేద కుటుంబాలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ఆర్థిక ఇబ్బందులతో జీవనం సాగిస్తున్నారని సంఘం జిల్లా అధ్యక్షుడు బురుగుల రాజు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పెన్షన్ పథకం వారికి ఎంతో అండగా ఉంటుందని పేర్కొన్నారు.
అయితే మండలంలో అర్హత ఉన్నప్పటికీ అనేక మందికి ఇప్పటికీ పెన్షన్లు మంజూరు కాలేదని, పలువురి దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ మంజూరు చేసి, పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిశీలించాలని కోరారు.
అలాగే గ్రామాల వారీగా ప్రత్యేక క్యాంపులు నిర్వహించి కొత్త పెన్షన్ దరఖాస్తులు స్వీకరించాలని, గతంలో అనర్హులుగా తొలగించిన వారి వివరాలను మరోసారి పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ఆసరా పథకాన్ని కొంతమందికే పరిమితం చేయకుండా అర్హులైన వృద్ధులు, బీడీ కార్మికులు, ఇతర అర్హత కలిగిన వర్గాలకు కూడా పెన్షన్ అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
అధికారులు తక్షణమే స్పందించి పెండింగ్ దరఖాస్తులను పరిష్కరిస్తే పేదలకు న్యాయం జరుగుతుందని సంఘం నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సంక్షేమ సహాయ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు భోజరెడ్డి, కాంతబాయ్, సాగర, జనసేన పార్టీ నిర్మల్ జిల్లా నాయకుడు సుంకేట మహేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.