
- ఆహార నాణ్యత విషయంలో రాజీ ఉండకూడదు: ఆహార కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్‌రెడ్డి
రాజోలు: విద్యార్థులు, చిన్నారులు, పేద ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న ఆహారం నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్‌రెడ్డి సూచించారు. కమిషన్ సభ్యులు జక్కంపూడి కృష్ణకిరణ్‌తో కలిసి రాజోలు నియోజకవర్గ పరిధిలోని పలు సంక్షేమ హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రం, రేషన్ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు.
మొదట వడ్డిగూడెం సాంఘిక సంక్షేమ హాస్టల్‌ను సందర్శించిన కమిషన్ చైర్మన్, సభ్యులు విద్యార్థులకు అందుతున్న భోజనం, ఆహార పదార్థాల నాణ్యత, వంటశాల పరిశుభ్రత, తాగునీటి సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మామిడికుదురు సాంఘిక సంక్షేమ హాస్టల్‌ను తనిఖీ చేసి, ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
తాటిపాక అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించిన కమిషన్ బృందం చిన్నారులకు అందుతున్న పౌష్టికాహారం, గుడ్లు, ఇతర ఆహార పదార్థాల నాణ్యతతో పాటు స్టాక్ వివరాలను పరిశీలించింది. చిన్నారులకు నాణ్యమైన ఆహారం అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని సూచించింది.
రాజోలు రేషన్ షాపులో బియ్యం, ఇతర నిత్యావసర సరుకుల నిల్వలు, స్టాక్ రిజిస్టర్లు, పంపిణీ వివరాలను పరిశీలించారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వం అందిస్తున్న రేషన్ సరుకులు సక్రమంగా అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం రాజోలు అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల, హాస్టల్‌ను తనిఖీ చేసి విద్యార్థులకు అందుతున్న భోజనం, వసతి, తాగునీరు, పారిశుధ్య సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకుని పలు సూచనలు చేశారు.
కామనగరువు బీసీ సంక్షేమ హాస్టల్‌లోనూ కమిషన్ బృందం తనిఖీలు నిర్వహించింది. విద్యార్థులకు అందుతున్న భోజనం, ఆహార పదార్థాల నాణ్యత, వంటశాల పరిశుభ్రత, ఆహార నిల్వలను పరిశీలించింది.
ఈ సందర్భంగా విజయ్ ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు, చిన్నారులు, పేద ప్రజలకు అందుతున్న ఆహారం నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఆహార భద్రతా పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా, సక్రమంగా అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
కమిషన్ సభ్యులు జక్కంపూడి కృష్ణకిరణ్ మాట్లాడుతూ సంక్షేమ హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలు, రేషన్ షాపుల్లో ఆహార నాణ్యత, నిల్వలు, పంపిణీ విధానాలను కమిషన్ నిరంతరం పర్యవేక్షిస్తుందని తెలిపారు. విద్యార్థులు, చిన్నారులకు పౌష్టికాహారం అందించడంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
ఈ తనిఖీల్లో సివిల్ సప్లయిస్, మహిళా శిశు సంక్షేమ, విద్యాశాఖ, ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ, ఎస్సీ, బీసీ, గిరిజన సంక్షేమ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.