
ఏటికొప్పాక బొమ్మలు ఉత్తరాంధ్ర సంస్కృతికి ప్రతీకగా నిలుస్తూ, వందలాది కుటుంబాల జీవనాధారంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అంకుడు కర్రతో, సహజ రంగులతో తయారయ్యే ఈ సంప్రదాయ హస్తకళను ప్రపంచానికి పరిచయం చేయాలనే లక్ష్యంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని తెలిపారు.
అధికారిక సమావేశాల్లో ఏటికొప్పాక బొమ్మలను జ్ఞాపికలుగా అందించడం, కళాకారుల సమస్యలను తెలుసుకోవడం, ముడిసరుకు లభ్యతపై దృష్టి సారించడం, మార్కెటింగ్ అవకాశాలను విస్తరించే దిశగా చర్యలు చేపట్టడం వల్ల గ్రామీణ హస్తకళలకు కొత్త ఊతం లభిస్తోందని పేర్కొన్నారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశయాన్ని ఉత్తరాంధ్ర కళలకు ప్రపంచ ద్వారంగా వినియోగించుకోవాలని సూచించారు. విమానాశయ ప్రవేశద్వారంలో ఏటికొప్పాక బొమ్మల భారీ కళారూపాలను ఏర్పాటు చేయడంతో పాటు, టెర్మినల్‌లో ప్రత్యేక విక్రయ కేంద్రం, కళాకారుల ప్రత్యక్ష ప్రదర్శనలు, ప్రతి బొమ్మకు కళాకారుడి వివరాలతో క్యూ ఆర్ కోడ్, ఆన్‌లైన్ మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తే ఈ కళకు శాశ్వత మార్కెట్ ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు.
ఏటికొప్పాక బొమ్మను కొనుగోలు చేయడం అంటే కేవలం ఒక వస్తువును కొనడం కాదని, ఒక కళాకారుడి కుటుంబానికి ఉపాధి కల్పించడంతో పాటు సంప్రదాయ కళను భవిష్యత్ తరాలకు అందించడమేనని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ప్రోత్సాహంతో ఏటికొప్పాక బొమ్మలు గ్రామ సరిహద్దులను దాటి ప్రపంచ వేదికపై ప్రత్యేక గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. చివరగా ఏటికొప్పాక బొమ్మ ఉత్తరాంధ్ర ఆత్మగౌరవానికి, తెలుగు సంస్కృతికి అపురూపమైన చిరునామాగా నిలవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.