
న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చే దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటన అనంతరం ఆంధ్ర భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు.
ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రస్తుతం అందిస్తున్న బియ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించడం లేదనే అంశంపై అధ్యయనం నిర్వహించగా, ప్రజలు స్టీమ్ రైస్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. దీనితో ప్రజా పంపిణీ వ్యవస్థలో స్టీమ్ రైస్ అందించే ప్రతిపాదనకు కేంద్రం సానుకూలంగా స్పందించిందన్నారు.
దేశంలోనే తొలిసారిగా కాకినాడ జిల్లాలో చౌకధరల దుకాణాల ద్వారా స్టీమ్ రైస్ పంపిణీని పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో ప్రతి నెల సుమారు 9 వేల మెట్రిక్ టన్నుల స్టీమ్ రైస్ అవసరమవుతుందని అంచనా వేస్తున్నామని, ఫలితాలను బట్టి రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని చెప్పారు.
రైతుల అభ్యర్థన మేరకు బాయిల్డ్ రైస్ ధాన్యం సేకరణ కోటాను మరో 20 వేల మెట్రిక్ టన్నులు పెంచేందుకు కేంద్రం అంగీకరించినట్లు తెలిపారు. దీంతో రాష్ట్రానికి మొత్తం 2.20 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ ధాన్యం సేకరణకు అవకాశం లభించిందన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 1,000 “మీ మార్టులు” ఏర్పాటు చేసేందుకు ఎన్‌సీసీఎఫ్‌తో ఒప్పందం కుదిరిందని తెలిపారు. ఈ మార్టుల్లో సుమారు 70 రకాల నిత్యావసర వస్తువులను తక్కువ ధరలకు అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు.
బియ్యం ధరల నియంత్రణలో భాగంగా ఆగస్టు 1 నుంచి రాష్ట్రంలోని 130 రైతుబజార్లు, 500 ప్రత్యేక విక్రయ కేంద్రాల ద్వారా బీపీటీ స్టీమ్ రైస్‌ను కిలో రూ.52కు, గ్రేడ్-1 రా రైస్‌ను కిలో రూ.50కు విక్రయించనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో స్వర్ణ రకం బియ్యాన్ని కూడా రైతుబజార్ల ద్వారా కిలో రూ.40కు అందించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
ప్రజా పంపిణీ వ్యవస్థలో త్వరలో కందిపప్పును కూడా చేర్చనున్నట్లు వెల్లడించారు. ప్రతి రేషన్ కార్డుదారునికి 500 గ్రాముల చొప్పున నాణ్యమైన కందిపప్పు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే కేంద్రం నుంచి రావాల్సిన రూ.281 కోట్ల పెండింగ్ నిధుల విడుదలకు ఆమోదం లభించినట్లు చెప్పారు.
సాంకేతికత వినియోగంలో భాగంగా ప్రస్తుతం అమలులో ఉన్న క్యూఆర్ కోడ్ విధానంతో పాటు ఆర్ఎఫ్ఐడీ (RFID) ఆధారిత ట్రేస్ అండ్ ట్రాక్ వ్యవస్థను కాకినాడ జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నట్లు తెలిపారు. బియ్యం మిల్లుల నుంచి వినియోగదారుడి వరకు ప్రతి దశను ఈ విధానం ద్వారా పర్యవేక్షించవచ్చని వివరించారు.
అదేవిధంగా ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి విశాఖ జిల్లాల్లో డిజిటల్ వాలెట్ విధానాన్ని పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేసే ప్రతిపాదన ఉందన్నారు. ప్రభుత్వం అందించే రాయితీని డిజిటల్ వాలెట్ రూపంలో అందించడం ద్వారా ప్రజలు తమ అవసరాలకు అనుగుణంగా నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఈ విధానంతో చౌకధరల దుకాణాల డీలర్లకు కూడా కమీషన్ వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని మంత్రి తెలిపారు.