
మంగళగిరి: పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతం లక్ష్యంగా జనసేన పార్టీ ప్రత్యేక ఫీడ్బ్యాక్, రివ్యూ సమావేశం మంగళగిరిలో నిర్వహించారు. పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జరిగిన ఈ సమావేశానికి జనసేన ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి అధ్యక్షత వహించారు.
Campaigns & Elections
సమావేశంలో పిఠాపురం టౌన్ ఇంచార్జ్ డాక్టర్ వరలక్ష్మి, పిఠాపురం మండల ఇంచార్జ్ వెన్నా జగదీశ్, గొల్లప్రోలు మండల ఇంచార్జ్ జ్యోతుల శ్రీనివాస్, గొల్లప్రోలు టౌన్ ఇంచార్జ్ మామిడాల సూరిబాబు, యు.కొత్తపల్లి ఇంచార్జ్ రావు అక్షయ పాల్గొన్నారు.
నియోజకవర్గంలోని గ్రామాలు, పట్టణ వార్డుల్లో నెలకొన్న ప్రజా సమస్యలు, స్థానిక అభివృద్ధి పనులు, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యాచరణ, రాజకీయ పరిస్థితులపై సమావేశంలో సమగ్రంగా సమీక్షించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారుల జాప్యాన్ని నివారించేలా చర్యలు తీసుకోవాలని ఇంచార్జిలు కోరారు. గ్రామ, వార్డు స్థాయిలో ప్రజలకు మెరుగైన సేవలు అందేలా పార్టీ నాయకులు మరింత సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు.
ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గానికి పార్టీ ఇంచార్జి నియామకం త్వరలోనే పూర్తి చేసే అవకాశముందని సమావేశంలో సంకేతాలు లభించినట్లు నాయకులు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం, పారదర్శక పాలన, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి జనసేన కట్టుబడి పనిచేస్తుందని పేర్కొన్నారు.