తీపర్రును ఆదర్శ పుష్కర గ్రామంగా తీర్చిదిద్దుతాం: మంత్రి కందుల దుర్గేష్

అమరావతి/నిడదవోలు: 2027 గోదావరి పుష్కరాల నాటికి పెరవలి మండలంలోని తీపర్రు గ్రామాన్ని ఆదర్శ పుష్కర గ్రామంగా, స్థానిక ఘాట్‌ను మోడల్ ఘాట్‌గా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. శనివారం తదేకం ఫౌండేషన్ సహకారంతో నిర్వహించిన ‘మా గోదావరి సంకల్ప్’ కార్యక్రమాన్ని గోదావరి హారతితో ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సంక్రాంతి నాటికి తీపర్రు మోడల్ విలేజ్ పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా చర్యలు చేపట్టామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, సనాతన ధర్మ పరిరక్షణ, పర్యాటకాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. కార్యక్రమం అనంతరం ఘాట్‌ను స్వయంగా శుభ్రం చేసిన మంత్రి, దళితవాడలో డ్రైనేజీ సమస్యను పరిశీలించి పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

గోదావరి పుష్కరాల దృష్ట్యా విజ్జేశ్వరం నుంచి సిద్ధాంతం వరకు 36 కిలోమీటర్ల ఏటిగట్టును పటిష్టపరిచేందుకు రూ.96 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలిపారు. ఈ మార్గంలోని 29 ఘాట్లను అభివృద్ధి చేయడం ద్వారా పుష్కరాల సమయంలో వచ్చే లక్షలాది మంది భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించవచ్చన్నారు.

తీపర్రు గ్రామానికి ప్రత్యామ్నాయ రహదారి నిర్మాణానికి రూ.1.80 కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు, సర్వే పూర్తైందని వెల్లడించారు. పుష్కరాల నాటికి గోదావరి తల్లి విగ్రహం ఏర్పాటు, చింతాలమ్మ చెరువు పునరుద్ధరణ పనులు కూడా పూర్తి చేస్తామని చెప్పారు.

రాజమహేంద్రవరం మాత్రమే కాకుండా కొవ్వూరు గోష్పాద ఘాట్, ముక్కామల, తీపర్రు, పెండ్యాల తదితర ఘాట్లను కూడా భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ద్వారకా తిరుమల, వాడపల్లి, కోటసత్తెమ్మ ఆలయం, గోలింగేశ్వరస్వామి ఆలయం వంటి పుణ్యక్షేత్రాలను అనుసంధానిస్తూ ప్రత్యేక టూరిస్ట్ సర్క్యూట్‌లను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.

పుష్కర ఘాట్లను ప్లాస్టిక్ రహితంగా, కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. మత్స్యకారుల జీవనోపాధికి ప్రభుత్వం అండగా ఉంటుందని, వేట నిషేధ సమయంలో ఇప్పటికే రూ.20 వేల ఆర్థిక సాయం అందించిన విషయాన్ని గుర్తు చేశారు.

కార్యక్రమంలో తదేకం ఫౌండేషన్ ప్రతినిధులు, కూటమి నాయకులు, స్థానిక అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.