విశాఖ తీరంలో విషాదం.. గల్లంతైన ఆరుగురు మత్స్యకారులు మృతి చెందినట్లు ప్రకటన

విశాఖపట్నం తీరంలో సముద్రంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారులు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. నాలుగు రోజుల పాటు ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్ సంయుక్తంగా చేపట్టిన గాలింపు చర్యల్లో ఎలాంటి ఫలితం లేకపోవడంతో బుధవారం అర్ధరాత్రి నుంచి ఆపరేషన్‌ను నిలిపివేశారు.

విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన ఏడుగురు మత్స్యకారులు ఈ నెల 1న విశాఖ హార్బర్ నుంచి వేటకు వెళ్లారు. ఈ నెల 4న తిరిగి వస్తుండగా బోటులో సాంకేతిక లోపం తలెత్తి సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో కరి చిన్న అనే మత్స్యకారుడు ప్రాణాలతో బయటపడగా, మిగిలిన ఆరుగురు గల్లంతయ్యారు.

కోస్ట్ గార్డ్‌కు చెందిన రెండు నౌకలు, రెండు హెలికాప్టర్లతో పాటు ఇతర బృందాలు నాలుగు రోజుల పాటు విస్తృతంగా గాలించినా వారి ఆచూకీ లభించలేదు. 72 గంటలకు పైగా గడిచినా ఎలాంటి సమాచారం అందకపోవడంతో వారు మృతి చెందినట్లు భావిస్తున్నామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.

ప్రాణాలతో బయటపడిన కరి చిన్నను ‘ఎంవీ యూనివర్స్ వెల్తీ’ అనే వాణిజ్య నౌక సిబ్బంది రక్షించి ఐఎన్‌ఎస్ డేగా ద్వారా కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి తరలించారు. బోటు మునిగిపోయిన తర్వాత తాను దాదాపు 18 గంటల పాటు సముద్రంలో ఈదుతూ ప్రాణాలు నిలబెట్టుకున్నానని, అనంతరం నౌక సిబ్బంది తనను రక్షించారని ఆయన వైద్యులకు వివరించారు.

ఈ ఘటనతో మత్స్యకారుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. మంత్రులు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులు బాధిత కుటుంబాలను పరామర్శించి, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.5 లక్షలు, మత్స్యశాఖ నుంచి రూ.5 లక్షలు కలిపి మొత్తం రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెక్కులను అందజేశారు. మత్స్యకారుల కుటుంబాలు పడుతున్న వేదన ఎంతో బాధాకరమని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.