
ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. విద్యార్థులకు అందించే డైట్ ఛార్జీలను 10 శాతం పెంచాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ పెంపును వచ్చే ఏడాది నుంచి అమలు చేయాలన్న ప్రతిపాదనను తిరస్కరించిన సీఎం, ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం నుంచే అమల్లోకి తీసుకురావాలని స్పష్టం చేశారు.
సంక్షేమ శాఖలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. విద్య ద్వారానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల జీవితాల్లో మార్పు వస్తుందని, వారికి మెరుగైన విద్యా అవకాశాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ విద్యాసంస్థలను కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లేలా అభివృద్ధి చేయాలని సూచించిన సీఎం, హాస్టళ్ల స్థానంలో మరిన్ని గురుకులాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల మరమ్మతుల కోసం రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ఐఐటీ, ఎన్ఐటీ, నీట్ వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, ప్రతిభావంతులైన ఇంటర్ విద్యార్థులకు పైలట్ ప్రాజెక్టు కింద ప్రత్యేక కోచింగ్ అందించాలని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్య పర్యవేక్షణ కోసం ప్రత్యేక వైద్య విభాగం ఏర్పాటు చేయాలని కూడా సూచించారు.
అదే సమావేశంలో పొగాకు కొనుగోళ్లపై కూడా సీఎం సమీక్ష నిర్వహించారు. కిలోకు ప్రభుత్వం నిర్ణయించిన రూ.200 కనీస మద్దతు ధరకు తగ్గకుండా కొనుగోళ్లు జరపాలని కంపెనీలను ఆదేశించారు. రైతులను ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరించవద్దని హెచ్చరిస్తూ, టొబాకో బోర్డు పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే సంస్థలపై అవసరమైతే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.