సోషల్ మీడియా దుర్వినియోగంపై పవన్ హెచ్చరిక.. చట్టం తన పని చేస్తుంది

సోషల్ మీడియా దుర్వినియోగంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాక్ స్వాతంత్ర్యం అనేది అపరిమిత హక్కు కాదని, ఇతరుల హక్కులు, గౌరవాన్ని దెబ్బతీసేలా దానిని వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కును స్వాగతిస్తామని, అయితే ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, వ్యక్తిగత దూషణలు చేయడం, హత్యా బెదిరింపులకు పాల్పడటం ఏమాత్రం సమర్థనీయం కాదన్నారు.

మత విశ్వాసాలను అవమానించడం, దేవుళ్లు, దేవతలపై ఉద్దేశపూర్వకంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం, మహిళలను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో వేధింపులకు పాల్పడడం రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛ పరిధిలోకి రాదని స్పష్టం చేశారు. నిర్మాణాత్మక విమర్శలు, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడాన్ని ప్రభుత్వం ఎప్పుడూ స్వాగతిస్తుందని, కానీ ద్వేషపూరిత ప్రచారం, పరువు నష్టం కలిగించే పోస్టులు, అసత్య ప్రచారాన్ని సహించబోమని తెలిపారు.

సైబర్ వేధింపులు, వ్యక్తిగత పరువు ప్రతిష్ఠలను దెబ్బతీసే చర్యలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్.. నేరానికి కులం, మతం, ప్రాంతం, రాజకీయ పార్టీ అనే భేదాలు ఉండవని స్పష్టం చేశారు. తప్పు చేసిన వారిపై చట్టం ముందు అందరూ సమానమేనని, ఎవరైనా చట్టప్రకారం చర్యలు ఎదుర్కోవాల్సిందేనన్నారు.

సోషల్ మీడియా వేధింపులకు గురవుతున్న బాధితులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని హామీ ఇచ్చిన ఆయన, డిప్యూటీ సీఎం కార్యాలయంలో ప్రత్యేక ఫిర్యాదు వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. బాధితులు స్క్రీన్‌షాట్లు, లింకులు, ఇతర డిజిటల్ ఆధారాలతో ఫిర్యాదు చేస్తే వెంటనే విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సోషల్ మీడియా నేరాలకు పాల్పడిన వారిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)తో పాటు సంబంధిత చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని, అవసరమైతే కొత్త చట్టాలు, ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.