
కాకినాడ : జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసే లక్ష్యంతో కాకినాడ పార్లమెంట్ పరిధిలో నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ సన్నాహక సమావేశం నిర్వహించారు.
కాకినాడ పార్లమెంట్ పరిశీలకులు, ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణానికి సంబంధించిన కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు.
పార్టీ కమిటీల్లో బాధ్యతలు చేపట్టి జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్న నాయకులు, జనసైనికుల నుంచి దరఖాస్తులను ఏ విధంగా స్వీకరించాలి, వాటిని ఎలా పరిశీలించాలి, ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా ఎలా నిర్వహించాలనే అంశాలపై కమిటీ సభ్యులకు స్పష్టమైన మార్గదర్శకాలు అందించారు.
ఈ సందర్భంగా సామినేని ఉదయభాను మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ ఆకాంక్షిస్తున్న బలమైన సంస్థాగత నిర్మాణాన్ని రూపొందించడం, క్షేత్రస్థాయిలో సమర్థవంతమైన నాయకత్వాన్ని తీర్చిదిద్దడం, ప్రజలకు మరింత చేరువయ్యే పార్టీ వ్యవస్థను నిర్మించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన కార్యకర్తలకు సముచిత గుర్తింపు లభించేలా, పారదర్శక విధానంలో సమాచార సేకరణ చేపట్టనున్నామని ఆయన వెల్లడించారు.
ఈ సమావేశంలో నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.