9 ఏళ్ల ప్రేమకు శుభం కార్డు.. ప్రియుడు ప్రవీణ్‌ను పెళ్లాడిన ఫైమా

ప్రముఖ టెలివిజన్ హాస్యనటి, జబర్దస్త్ ఫేమ్ ఫైమా తన తొమ్మిదేళ్ల ప్రేమకు పెళ్లితో శుభం కార్డు పలికారు. చిరకాల ప్రియుడు ప్రవీణ్ నాయక్‌ను బుధవారం హైదరాబాద్‌లోని ఓ రిజిస్ట్రార్ కార్యాలయంలో నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు.

తమ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్న ఫైమా భావోద్వేగపూరిత సందేశాన్ని పోస్ట్ చేశారు. తమ ప్రేమ ప్రయాణంలో ఎన్నో విమర్శలు, అనుమానాలు ఎదురైనా ఒకరినొకరు విడిచిపెట్టకుండా ముందుకు సాగామని తెలిపారు. “విడిపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నా, కలిసి ఉండాలని నిర్ణయించుకున్నాం. ఇప్పుడు అధికారికంగా భార్యాభర్తలమయ్యాం” అని పేర్కొన్నారు.

జబర్దస్త్, పటాస్ కార్యక్రమాలతో పాటు బిగ్ బాస్ తెలుగు ద్వారా ఫైమా ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. జబర్దస్త్ వేదికపై ప్రవీణ్, ఫైమా జోడీగా కనిపించగా, ఆ అనుబంధం క్రమంగా ప్రేమగా మారింది.

గతంలో వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయనే వార్తలు, ప్రవీణ్‌కు మరో వివాహం జరిగిందనే ప్రచారం జరిగినప్పటికీ, వాటన్నింటినీ అధిగమించి చివరకు ఇద్దరూ ఒక్కటయ్యారు. ప్రస్తుతం వీరి వివాహ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అభిమానులు, బుల్లితెర ప్రముఖులు నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తొమ్మిదేళ్ల ప్రేమను విజయవంతంగా వివాహ బంధంగా మార్చుకున్న ఫైమా-ప్రవీణ్ జంటపై ప్రశంసలు కురుస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.