ఆడబిడ్డలకు అండగా జిల్లా రవాణా అధికారి శ్రీనివాసరావు.. నాలుగో కుటుంబాన్ని దత్తత

అయినవిల్లి మండలం కె. జగన్నాధపురం గ్రామానికి చెందిన నిరుపేద చేనేత కుటుంబానికి జిల్లా రవాణా శాఖ అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు అండగా నిలిచారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పి-4 పథకం కింద ఆయన నాలుగో కుటుంబాన్ని దత్తత తీసుకుంటున్నట్లు గ్రామ పెద్దల సమక్షంలో ప్రకటించారు.

గ్రామానికి చెందిన పిచ్చిక సత్యనారాయణ పక్షవాతంతో బాధపడుతూ ఈ నెల 19న గుండెపోటుతో మృతి చెందగా, ఆయన భార్య సరస్వతి పూర్తి మానసిక దివ్యాంగురాలు. ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉండగా, తండ్రి అంత్యక్రియలను వారే నిర్వహించడం స్థానికులను కలచివేసింది.

ఈ విషయాన్ని తెలుసుకున్న జిల్లా రవాణా అధికారి శ్రీనివాసరావు కుటుంబాన్ని స్వయంగా పరామర్శించి, వారి పరిస్థితిని పరిశీలించారు. పి-4 పథకం కింద ఆ కుటుంబాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటిస్తూ, అవసరమైన అన్ని సదుపాయాలను కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేయడంతో పాటు, దివ్యాంగురాలైన సరస్వతికి తక్షణ అవసరంగా ఫ్యాన్ ఏర్పాటు చేశారు. కుటుంబానికి అవసరమైన వస్త్రాలు మరియు ఇతర మౌలిక అవసరాలను కూడా సమకూర్చనున్నట్లు తెలిపారు. నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన జిల్లా రవాణా అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావుకు గ్రామ పెద్దలు ములికి విఘ్నేశ్వరుడు, అంకం వీర్రాజు, ఇనుమర్తి రాజు, కోట సత్తిరాజు, కొంకి వెంకట్రావు తదితరులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇనుమర్తి లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.