
* మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి
* బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఉప ముఖ్యమంత్రి భరోసా
అనకాపల్లి జిల్లా, పరవాడ ఫార్మాసిటీలోని దక్షిణ ఎనర్జీ కెమికల్ కర్మాగారంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందిన ఘటన పట్ల రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ నుంచి వివరాలు తెలుసుకున్నారు. మంగళవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్టు అధికారులు వివరించారు. మంటలు అదుపులోకి వచ్చాయా లేదా అని ఆరా తీశారు. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలపై సమీక్షించాలని సూచించారు. విశాఖ పరిసరాల్లో ఉన్న పారిశ్రామికవాడల్లోని అన్ని సంస్థల్లో తక్షణం సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని స్పష్టం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.