శ్రీశైలంలో యోగాంధ్ర కార్యక్రమాలు.. జూన్ 8న ప్రత్యేక యోగా నిర్వహణ

శ్రీశైలం : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా శ్రీశైల దేవస్థానం పరిధిలో పలు యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేష్‌నాయుడు, కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు సంయుక్తంగా వెల్లడించారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమాలకు ముందస్తు సన్నాహకంగా జూన్ 6, 7 తేదీలలో చంద్రవతి కల్యాణ మండపంలో ప్రత్యేక యోగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో పేరొందిన యోగా గురువుల ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమాలు జరుగనున్నాయని తెలిపారు.

జూన్ 8వ తేదీన గంగాధర మండపం వద్ద భారీ స్థాయిలో ప్రత్యేక యోగా కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం ప్రత్యేక వేదికతో పాటు గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు చెప్పారు.

అలాగే జూన్ 21వ తేదీన జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని కూడా గంగాధర మండపం వద్దనే ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల విజయవంతమైన నిర్వహణ కోసం దేవస్థానం ఇప్పటికే పకడ్బందీ చర్యలు చేపట్టిందన్నారు.

స్థానికులు, యాత్రికులు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో పాటు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనలో భాగస్వాములు కావాలని ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేష్‌నాయుడు, కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.