
శ్రీశైలంలో చెంచు గిరిజన భక్తులకు ప్రతి నెల ఒక రోజు ప్రత్యేకంగా ఉచిత స్పర్శదర్శనం కల్పించాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని గత డిసెంబర్ నెలలో ముక్కోటి ఏకాదశి రోజున ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి నెల చివరి బుధవారం చెంచు గిరిజన భక్తులకు ఉచితంగా స్వామివారి స్పర్శదర్శనం కల్పిస్తున్నారు. ఈ క్రమంలో ee బుధవారం కూడా చెంచు గిరిజన భక్తులు శ్రీశైలం క్షేత్రానికి చేరుకుని శ్రీశ్రీ స్వామి వారిని, అమ్మవారిని దర్శించుకున్నారు.
స్థానిక చెంచు గూడెములతో పాటు పల్నాడు జిల్లా, మార్కాపురం ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఈ ప్రత్యేక దర్శనంలో పాల్గొన్నారు.
ఉదయం సంప్రదాయబద్ధంగా చెంచు భక్తులు తప్పెట వాయిద్యాలు, సంప్రదాయ నృత్యాలతో ఆలయానికి చేరుకున్నారు. వారికి ఉమారామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద ఆలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు.
దర్శన అనంతరం చెంచు గిరిజన భక్తులందరికీ దేవస్థానం అన్నపూర్ణా ప్రసాద వితరణ భవనంలో అన్నప్రసాదం ఏర్పాటు చేసి అందజేశారు. భక్తుల సౌకర్యార్థం ఈ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు స్థానిక ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి సహకారం తీసుకున్నారు.
ఈ కార్యక్రమం ద్వారా గిరిజన భక్తులకు ఆధ్యాత్మిక అనుబంధం పెంపొందించడమే కాకుండా వారి సంప్రదాయాలకు గౌరవం కల్పిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.