
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌కు సంబంధించిన పోక్సో కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్‌లో చెర్లపల్లి జైలులో ఉన్న భగీరథ్‌కు తెలంగాణ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకునేందుకు గురువారం అనుమతి ఇచ్చింది.
భగీరథ్ తరఫు న్యాయవాది కరుణా సాగర్, ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు కోర్టును కోరారు. మే 16న పోలీసులు భగీరథ్‌ను అరెస్ట్ చేసినందున ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ అవసరం లేదని న్యాయస్థానానికి తెలిపారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, పిటిషన్ ఉపసంహరణకు అనుమతిస్తూ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.
మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలతో మే 8న పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో భగీరథ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. అనంతరం బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా పోలీసులు పోక్సో చట్టంలోని మరిన్ని కఠిన సెక్షన్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు.
ఈ కేసులో అరెస్ట్ నుంచి మధ్యంతర రక్షణ ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను మే 15న హైకోర్టు తిరస్కరించింది. దీంతో మే 16న రాత్రి పోలీసులు భగీరథ్‌ను అరెస్ట్ చేశారు. అయితే, తన కుమారుడు స్వచ్ఛందంగా లొంగిపోయాడని బండి సంజయ్ పేర్కొన్నారు.
అనంతరం భగీరథ్‌ను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఆయన చెర్లపల్లి జైలులో ఉన్నారు.