
కోనసీమ జిల్లాలో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 20 సూత్రాల కార్యక్రమంపై ముందస్తు సమీక్ష సమావేశం గురువారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా జాయింట్ కలెక్టర్ వైఖోం నైదియాదేవి అధ్యక్షత వహించారు.
ఈనెల 22న 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్‌పర్సన్ లంకా దినకర్ ఆధ్వర్యంలో జరగనున్న సమీక్ష సమావేశాన్ని దృష్టిలో ఉంచుకుని, జిల్లాలోని వివిధ శాఖలు సాధించిన ప్రగతిని అధికారులు సమీక్షించారు.
ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, అమృత్ 2.0, జలజీవన్ మిషన్, ప్రధాన మంత్రి సూర్య ఘర్, పీఎం కుసుమ్, వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గర్ వంటి పథకాల పురోగతి నివేదికలపై చర్చించారు.
జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. 20 సూత్రాల కార్యక్రమం పేదరిక నిర్మూలన, గ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పన, సామాజిక న్యాయం లక్ష్యాలతో అమలు అవుతోందని తెలిపారు. అర్హులైన ప్రతి పేదవారికి పక్కా ఇల్లు, సురక్షిత తాగునీరు, పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా విద్యుత్ అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు.
వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గర్ మిషన్ కింద కూలీలకు సకాలంలో పనులు, వేతనాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరును మెరుగుపరచి, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు.
అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందేలా నిరంతర పర్యవేక్షణ ఉండాలని తెలిపారు. మహిళలు ఆర్థికంగా బలపడేందుకు పొదుపు సంఘాలకు బ్యాంకు లింకేజీలు, రుణ సదుపాయాలు వేగవంతం చేయాలని కోరారు.
“ఏ పథకమైనా లబ్ధిదారుడి ముఖంలో నవ్వు తెచ్చినప్పుడే ఆ పథకానికి సార్థకత ఉంటుంది” అని జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు. కేటాయించిన నిధులను సకాలంలో, పారదర్శకంగా వినియోగించాలని అధికారులకు సూచించారు. అలసత్వం ప్రదర్శిస్తే సహించబోమని హెచ్చరించారు.
క్షేత్రస్థాయి పర్యటనలు పెంచి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించాలని, 20 సూత్రాల కార్యక్రమాల అమలులో కోనసీమ జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలబెట్టేందుకు అందరూ జట్టు భావనతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
డీఆర్వో వి. సుబ్బారావు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన “ఒక గ్రామం – ఒక నెల – నాలుగు పర్యటనలు” కార్యక్రమాన్ని రద్దు చేసి, దాని స్థానంలో “ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు పర్యాయాల పర్యటన” కార్యక్రమాన్ని ఈనెల 22 నుంచి అమలు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో ఏపీ ఈపీడీసీఎల్ పర్యవేక్షక ఇంజనీర్ బి. రాజేశ్వరి, డీఎంహెచ్‌వో ఎం. దుర్గారావు దొర, డీఈవో నాగేశ్వరరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్‌ఈ ఏవీఎస్ రాజన్, జిల్లా అర్ధగణాంకాధికారి మురళీకృష్ణ, వయోజన విద్య నోడల్ అధికారి విజయభాస్కరరావు, డీసీహెచ్ఎస్ కార్తీక్, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.