రాజకీయ విశ్లేషణ పేరుతో వాస్తవాలను వక్రీకరణ సరికాదు: రియా

నరసాపురంనియోజకవర్గం: రాజకీయ విశ్లేషణ పేరుతో వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పుదారి పట్టించడం సరికాదని ప్రొఫెసర్ నాగేశ్వరరావును ఉద్దేశిస్తూ జనసేన వీరమహిళ రియా స్పందించారు. “మేధావి” అనే పదానికి విలువ ఉండాలని ఆమె పేర్కొన్నారు. రాజకీయ విశ్లేషణ పేరుతో వాస్తవాలను వక్రీకరించడం, ఊహాగానాలను నిజాల్లా ప్రచారం చేయడం ప్రజలను తప్పుదారి పట్టించడమేనని విమర్శించారు.

జగన్ రెడ్డి గురించి ఎవరిని అరెస్ట్ చేయాలి, ఎవరిని కాపాడాలి అనే ఆలోచనల్లో జనసేన లేదని ఆమె స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై పోరాడటం, వ్యవస్థను ప్రశ్నించడం, యువతకు భరోసా ఇవ్వడం — ఇవే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజకీయ ధోరణి అని తెలిపారు.

వ్యక్తిగతంగా, రాజకీయంగా ఎన్నో ఇబ్బందులు ఎదురైనా అధికారానికి తలవంచకుండా “నా పోరాటం నేనే చేస్తా” అని నిలబడ్డ నాయకుడు పవన్ కళ్యాణ్ అని రియా అన్నారు. అలాంటి నాయకుడిని పక్కనపెట్టి, రాజకీయంగా బలహీన స్థితిలో ఉన్న వ్యక్తి కోసం ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ జరుగుతుందని చెప్పడం పూర్తిగా అసంబద్ధమని వ్యాఖ్యానించారు.

ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితిలో, కోర్టు అనుమతులతో తిరిగే నాయకుడి గురించి దేశ హోం మంత్రివరకు వెళ్లి మాట్లాడాల్సిన అవసరం జనసేనకు లేదని ఆమె స్పష్టం చేశారు. జనసేన రాజకీయాలు వ్యక్తుల చుట్టూ కాకుండా ప్రజల సమస్యల చుట్టూ తిరుగుతాయని పేర్కొన్నారు.

“మీ దగ్గర నిజంగా ఆధారాలు ఉంటే బయట పెట్టండి. లేకపోతే ‘సమాచారం ఉంది’, ‘లోపలి వార్త’ అంటూ రాజకీయ కథలు చెప్పడం మానేయండి” అని రియా సూచించారు.

ప్రజలు ఇప్పుడు విశ్లేషణకు, ప్రచారానికి మధ్య తేడా గుర్తించే స్థాయికి వచ్చారని, నిజం చెప్పడమే అసలైన మేధావితనమని ఆమె అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.