నియోజకవర్గ స్థాయి కమిటీలలో స్థాన కల్పనకు కసరత్తు

• క్యాడర్ టూ లీడర్ స్థాయి కోసం వివరాల స్వీకరణ
• ఇందుకోసం పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా కమిటీల ఏర్పాటు
• కమిటీల నివేదికల పరిశీలనకు పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కమిటీ

జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. ఇందులో భాగంగా నియోజక వర్గాల్లో క్యాడర్ టూ లీడర్ స్థాయి కల్పనకు వివరాలు స్వీకరిస్తారు. ఆ స్థానం కల్పనకు నియోజక వర్గాల నుంచి వ్యక్తిగత వివరాలు, పార్టీకి చేసిన సేవలు తెలియచేసే పత్రాలను స్వీకరిస్తారు. సంస్థాగత నిర్మాణం, కమిటీల ఏర్పాటుపై జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ శనివారం మధ్యాహ్నం నుంచి సుదీర్ఘంగా చర్చించారు. ఇందుకు సంబంధించి మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్యులతో సమావేశమయ్యారు. శుక్రవారం నిర్వహించిన జనసేన ఉద్యమి ఆత్మీయ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణ ప్రక్రియ గురించి, కమిటీల గురించి పార్టీ నేతలు, వీర మహిళలు, సాధక్ లకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలియచేసిన విషయం విదితమే. ఇందుకు అనుగుణంగా శనివారం పార్టీ నిర్మాణంపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు చర్చించారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పత్రాల స్వీకరణకు కమిటీలు ఏర్పాటు చేశారు. ప్రతి కమిటీలో ఏడుగురు సభ్యులు ఉంటారు. ఆ పార్లమెంట్ నియోజక వర్గానికి సంబంధించి ఎమ్మెల్యే/ఎంపీ/సీనియర్ నేతలు, మహిళా నేతలు, 2014 నుంచి పార్టీ కోసం పని చేస్తున్న నాయకుడు, ఇద్దరు సాధక్ లు ఈ కమిటీలో ఉంటారు. ఈ కమిటీకి – 10 నుంచి 25 మంది సాధక్ లు సమన్వయ బృందంగా సహకరిస్తారు. ఆ పార్లమెంట్ నియోజక వర్గం పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజక వర్గాల కమిటీలలో స్థానం పొందాలి అనుకొనేవారు అందచేసే పత్రాలు స్వీకరిస్తారు. వాటిని సమీకరించి ఒక నివేదికతో పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రాంతీయ కమిటీల సభ్యులు అందచేస్తారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఏర్పాటయ్యే కమిటీ ఈ నివేదికలను పరిశీలన చేస్తుంది. తదనంతరం నియోజకవర్గాల ఇంఛార్జులు, కమిటీలలో సభ్యులను నియమిస్తారు. పార్లమెంట్ నియోజక వర్గాలవారీగా పత్రాల స్వీకరణ నుంచి నియోజకవర్గ కమిటీల ప్రకటన వరకూ మొత్తం ప్రక్రియను 4 వారాల్లో ముగించేలా ప్రణాళిక సిద్ధం చేయాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు కేంద్ర కార్యాలయానికి నిర్దేశించారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.