
• క్షతగాత్రులకు పూర్తి వైద్యసాయం అందిస్తాం
• పని ప్రదేశాల్లో ప్రమాదాల నివారణకు చర్యలు
కాకినాడ రూరల్ మండలం పరిధిలో పని ప్రదేశంలో రోడ్డు దాటుతున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మహిళా ఉపాధి శ్రామికులు మృతి చెందారన్న విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానంటూ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. చీడిగ గ్రామానికి చెందిన ఆరుగురు మహిళా శ్రామికులు రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన టిప్పర్ ఢీ కొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలియజేశారు. పని ప్రదేశంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం తీవ్రంగా కలచి వేసింది. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించాలని కాకినాడ జిల్లా యంత్రాంగానికి సూచించాను. వారు పూర్తిగా కోలుకునే వరకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా నిలుస్తాం. మృతి చెందిన శ్రామికుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచిన పరిహారం రూ. 4 లక్షలు త్వరితగతిన అందించే ఏర్పాటు చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ. 2 లక్షలు, పి.ఎం. సురక్ష యోజన, పి.ఎం. జీవన్ జ్యోతి యోజన కింద వచ్చే బీమా మొత్తాన్ని వీరికి అందిస్తాం. రహదారుల వెంబడి పని ప్రదేశాల్లో ప్రమాద నివారణకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించాం. జాతీయ రహదారుల వెంబడి, వాహనాలు వేగంగా వచ్చే బైపాస్ రోడ్ల వెంబడి, ట్రాఫిక్ రద్దీ ఉండే రహదారుల వెంబడి ఉపాధి పనులు జరుగుతున్న సమయంలో వేగ నియంత్రణకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని అదేశించాం అని శ్రీ పవన్ కళ్యాణ్ వెల్లడించారు.