
150 మందితో మొదలైన పార్టీ ప్రస్థానం 22 లక్షలకు చేరింది
• ప్రజా సమస్యల ఆధారంగానే జనసేన పోరాటం
• కొత్తవారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తేనే పార్టీ మరింత బలోపేతం
• నాయకత్వాన్ని పెంచుకోవడానికి స్థానిక సంస్థల ఎన్నికలు మంచి అవకాశం
• పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో సాధక్ లది కీలక పాత్ర
• అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ భవిష్యత్తులో తగిన స్థానం
• జనసేన ఉద్యమి ఆత్మీయ సమావేశంలో పార్టీ పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్
‘రాజకీయాల్లో సమూల మార్పు రావాలి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలి అనే ఏకైక ఆశయంతో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలుపెరుగని పోరాటం చేశారు. మనందరి భవిష్యత్తును తన బాధ్యతగా భావించి ఆయన జనసేన పార్టీని స్థాపించారు. కేవలం 150 మందితో ప్రారంభమైన ఈ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం, నేడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి చేరింది. ఈ అద్భుత విజయ ప్రయాణంలో, శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో సాధక్ లు అత్యంత కీలకమైన పాత్ర పోషించారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసిన ప్రతి ఒక్క సాధకుడికి, జన సైనికుడికి నా హృదయపూర్వక అభినందనల’ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పేర్కొన్నారు. జనసేన ఉద్యమి ఆత్మీయ సమావేశం శుక్రవారం సాయంత్రం మంగళగిరిలో జరిగింది. ఈ సందర్భంగా శ్రీ మనోహర్ గారు మాట్లాడుతూ “జనసేన పార్టీలో సభ్యత్వం అనేది కేవలం రికార్డుల్లో ఉండే సంఖ్య కాదు. అది మన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదర్శాలను, పార్టీ యొక్క మూల సిద్ధాంతాలను క్షేత్రస్థాయిలోకి, ప్రతి గుండెల్లోకి బలంగా తీసుకెళ్లే ఒక చైతన్యవంతమైన సమూహం.
• 94 వేల మంది నుంచి … 22 లక్షలకు చేరాం
2020లో చిన్నగా మొదలైన జనసేన సభ్యత్వ ప్రస్థానం.. నేడు 22 లక్షల మంది మహా కుటుంబంగా మారింది. 2020లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు 4,748 మంది సాధక్ లు క్షేత్రస్థాయిలో పర్యటించి 94,024 సభ్యత్వాలు చేయగలిగారు. కోవిడ్ పరిస్థితుల్లో ఒకవైపు సేవా కార్యక్రమాలు చేస్తూ 2022లో 3.27 లక్షల సభ్యత్వం నమోదు చేయగలిగాం. 2023లో 5.5 లక్షల సభ్యత్వాలు, 2024లో 12 లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయి. ప్రస్తుతం 21.50 లక్షలకు చేరాం. పదేళ్ల నిరంతర పోరాటం, గత ఎన్నికల్లో సాధించిన 100 శాతం విజయ భేరితో జనసేన పార్టీ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒక రిజిస్టర్డ్ పార్టీ స్థాయి నుంచి గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీగా రూపాంతరం చెందింది.
• 1,034 మందిని కోల్పోయాం .. బాధాకరం
జనసేన సభ్యత్వ నమోదు మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 1,034 మంది జన సైనికులు, వీర మహిళలు ప్రాణాలు కోల్పోవడం మనందరికీ అత్యంత బాధాకరం. మన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆ కుటుంబాలకు అండగా నిలబడ్డారు. పార్టీ తరఫున రూ.46.35 కోట్లు అందించి ఆర్థికంగా అండగా నిలబడ్డారు. చనిపోయిన మన జనసైనికుల పిల్లల చదువుల బాధ్యతను కూడా పార్టీయే తన భుజాలపై వేసుకుంది.
• స్వార్థ రాజకీయాలకు జనసేన ఎప్పుడూ దూరం
2017లో శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు ఆయన ఒకటే మాట చెప్పారు. పరిస్థితులను బట్టి, అవసరాలను బట్టి మారిపోయే స్వార్థ రాజకీయాలు మనం ఎప్పటికీ చేయకూడదని స్పష్టం చేశారు. ఆ రోజు ఆయన చెప్పిన మాట ప్రకారం.. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం కేవలం ప్రజల సమస్యల ఆధారంగానే నిజాయతీ గల రాజకీయాలు చేశాం. కేవలం ప్రజలకు మేలు జరిగే అంశాలకు మాత్రమే కట్టుబడి, వారి ప్రయోజనాల కోసమే పార్టీ కార్యక్రమాలను రూపొందించాం. నాడు కౌలు రైతుల ఆర్థిక సాయం నుండి.. రోడ్ల దుస్థితిపై చేసిన పోరాటాల వరకు.. మనం నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడే కార్యక్రమాలు చేశాం తప్ప ఎప్పుడూ స్వార్థంతో పని చేయలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న రకరకాల ప్రచారాలను మనం క్షుణ్ణంగా గమనించాలి. వాటిని చూసి తొందరపడి, ఆవేశంతో స్పందించి పార్టీకి నష్టం చేయవద్దు. ఏది పార్టీకి మేలు? ఏది నష్టం? అనేది ఆలోచించి నడుచుకోవాలి. మన పార్టీలో ఎలాంటి వర్గాలు లేవు, భిన్న నాయకత్వాలు లేవు. మనకు ఉన్నది ఒకే ఒక్క నాయకుడు.. ఆయనే శ్రీ పవన్ కళ్యాణ్ గారు. మనం కేవలం మన నాయకుడి కోసమే కష్టపడాలి. ఆయన ఎప్పుడూ మన మంచిని, రాష్ట్ర భవిష్యత్తును మాత్రమే కోరుకుంటారు. క్షేత్రస్థాయిలో నిజాయితీగా కష్టపడిన ప్రతి ఒక్కరికీ శ్రీ పవన్ కళ్యాణ్ గారు తగిన గుర్తింపునిచ్చారు. పదవులు ఇచ్చి గౌరవించారు. ఆ గౌరవాన్ని కాపాడుకుంటూ క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి మనమంతా కష్టపడాలి. సమావేశాల్లో కుర్చీలు వేయలేదనో, ఫ్లెక్సీలలో ఫోటోలు పెట్టలేదనో చిన్న పిల్లల్లా గొడవలు పడకండి. క్రమశిక్షణతో ఉంటూ నాయకుడి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే మన మొదటి లక్ష్యం కావాలి.
• కొత్తవారిని ఆహ్వానిద్దాం… పార్టీని బలోపేతం చేద్దాం
త్వరలోనే మున్సిపల్, కార్పొరేషన్, స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. క్షేత్రస్థాయిలో మన పార్టీ నాయకత్వాన్ని పెంపొందించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. పొత్తులో భాగంగా మన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీసుకునే ప్రతి నిర్ణయానికి అనుగుణంగా మనమంతా నిజాయితీగా కలిసి పనిచేయాలి. గతంలో వైసీపీ స్థానిక ఎన్నికలను బలవంతంగా ఏకగ్రీవం చేయాలని చూసింది. కానీ శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపుతో మన జన సైనికులు ప్రాణాలకు తెగించి పోటీలో నిలబడ్డారు. సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా గెలిచారు. ఆ ఎన్నికల్లో పోటీ చేసినందుకు మనపై అక్రమ కేసులు పెట్టి, వేధించినా భయపడకుండా నిలబడ్డాం. 175 నియోజకవర్గాల్లోనూ జనసేన పార్టీ మరింత బలోపేతం కావాలి. పార్టీ ఇంకా బలపడాలి అంటే మనం కొత్తవారిని పెద్దమనసుతో పార్టీలోకి ఆహ్వానించాలి. ఏ నియోజకవర్గంలో ఎవరు కష్టపడ్డారో, ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలో శ్రీ పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు. అన్ని కోణాల్లో పరిశీలించి, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ భవిష్యత్తులో తగిన స్థానం, పదవి లభిస్తాయి. ప్రజల ఆలోచనలు మారాయి. రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో కష్టపడటం ప్రారంభించండి. గతంలో మనం రోడ్లపైకి వచ్చి ఏ విధంగా అయితే పోరాటాలు చేసి జనసేన జెండాను ఎగరేశామో.. అదే స్ఫూర్తిని మళ్లీ తీసుకురావాలి. క్షేత్రస్థాయిలో కష్టపడి స్థానిక సంస్థలపై జనసేన జెండాను ఎగరేద్దాం.
• అందుకే ప్రధాని నుంచి అరుదైన గౌరవం
మనం ఎప్పుడూ స్వార్థంతో కూడిన అవకాశవాద రాజకీయాలు చేయలేదు. మొదటి నుంచి ఎంతో నిజాయితీతో, విలువలతో కూడిన రాజకీయాలు చేశాం. ఆ నైతికత వల్లే ఈ రోజు జనసేన పార్టీకి జాతీయ స్థాయిలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవం లభించాయి. మన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నిజాయతీని, నిస్వార్థ ప్రయాణాన్ని గౌరవిస్తూ.. గౌరవ దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారే స్వయంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వచ్చి పరామర్శించారు. పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి ప్రజల కోసం ఎంతో నిజాయతీతో ప్రయాణం చేశారు కనుకే.. దేశంలోనే అత్యున్నత స్థానంలో ఉన్న ప్రధాని గారి నుంచి ఈ అరుదైన గౌరవం దక్కింది” అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు, పార్టీ ఎంపీలు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, మాజీ శాసన సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, ముఖ్య నేతలు, సాధక్ లు పాల్గొన్నారు.