
హైదరాబాద్: తన కుమారుడు బండి సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసుపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తొలిసారిగా స్పందించారు. కరీంనగర్‌లో నిర్వహించిన హిందూ ఏక్తా యాత్రలో మాట్లాడిన ఆయన, తన కుమారుడిని నేరస్తుడిగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
“ఏ తప్పూ చేయలేదని నా కుమారుడు చెబుతున్నాడు. అయితే నేను అతడిని సమర్థించడం లేదు. చట్టాన్ని, న్యాయాన్ని గౌరవిస్తాం. కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తాం” అని బండి సంజయ్ తెలిపారు. తన కుమారుడిపై జరుగుతున్న పరిణామాలతో కుటుంబం తీవ్ర మానసిక వేదన అనుభవిస్తోందని చెప్పారు. ముఖ్యంగా తన భార్య తీవ్ర ఆందోళనకు గురై డిప్రెషన్‌లోకి వెళ్తోందని భావోద్వేగానికి లోనయ్యారు.
రాజకీయ కారణాలతోనే తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. తాను భయపడుతున్నానని ప్రత్యర్థులు భావిస్తున్నారని, కానీ ఎప్పుడూ భయపడబోనని స్పష్టం చేశారు. తమ కుటుంబం, పార్టీని ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు.
గత డిసెంబర్ 31న హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో 17 ఏళ్ల బాలికపై లైంగిక దాడి జరిగిందన్న ఆరోపణలతో భగీరథ్‌పై మే 8న పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఈ కేసు విచారణ పర్యవేక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం డీసీపీ రితిరాజ్‌ను ప్రత్యేక అధికారిగా నియమించింది.
ఇదిలా ఉండగా, ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ బండి భగీరథ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.